తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూశారు. ఆయన కొన్ని రోజుల కిందట.. కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్నారని అనుకున్నారు కానీ.. ఆయన అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. శ్రీవారి ఆలయంలో నలుగురు ప్రధాన అర్చకులు ఉంటారు. అయితే ప్రధానంగా రమణదీక్షితుల పేరే వినిపిస్తూ ఉంటుంది. శ్రీనివాసమూర్తి దీక్షితులు కూడా ప్రధాన అర్చకులే. ఇరవై ఏళ్ల పాటు ఆయన శ్రీవారి కైంకర్య సేవల్లో పాల్గొన్నారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత వారి వారసులకు.. చాన్సిచ్చారు.
ప్రస్తుతం టీటీడీ ఆలయ ప్రధాన అర్చకుల్లో శ్రీనివాసమూర్తి దీక్షితుల కుమారుడు కూడా ఒకరు. ఆయనకు కరోనా సోకింది. ఆయన ద్వారా తండ్రికి సోకినట్లుగా తెలుస్తోంది. శ్రీనివాసమూర్తి దీక్షితులకు.. మెరుగైన వైద్యం అందించేందుకు టీటీడీ ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. శ్రీవారికి ఇరవై ఏళ్లకుపైగా సేవలు అందించిన శ్రీనివాసమూర్తి దీక్షితులకు.. టీటీడీ సంప్రదాయబద్దంగా తుది వీడ్కోలు పలకాల్సి ఉంది. కానీ కరోనా మరణం అవడం వల్ల.. ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
టీటీడీ ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ 150 మందికిపైగా కరోనా సోకిందని.. టీటీడీ చైర్మనే ప్రకటించారు. వారిలో సగం మంది కోలుకున్నారని… దర్శనాలు నిలిపివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పెద్ద జియ్యంగార్కు కరోనా సోకిందని నిర్ధారణ అయిన తర్వాత దర్శనాలు నిలిపివేసే అంశంపై సమీక్షిస్తామని.. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కానీ అలాంటి ఆలోచన లేదని.. అనధికారికంగా చెబుతున్నారు.