హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం ఆయన జన్మస్థలం రామేశ్వరంలో జరిగాయి. పూర్తి సైనిక లాంఛనాలతో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడి, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, త్రివిధ దళాల అధిపతులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుసహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సామాన్య ప్రజలుకూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఖననానికిముందు కలామ్ పార్థివదేహాన్ని ఆయన ఇంటికి సమీపంలోని ఒక మసీదుకు తీసుకెళ్ళి ప్రత్యేకప్రార్థనలు జరిపినతర్వాత అక్కడనుంచి అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి సైనిక లాంఛనాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. దీనికోసం మిస్సైల్ లాంచర్ వాహనాన్ని ఉపయోగించటం విశేషం. ప్రధాని మోడి కలామ్ సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖననానికిముందు ప్రముఖులందరూ చివరిసారిగా కలామ్ పార్థివదేహానికి పూలగుఛ్ఛాలతో నివాళులర్పించారు. మృతదేహాన్ని కప్పిన జాతీయపతాకాన్ని సైనికదళాల ప్రతినిధులు ఆయన కుటుంబసభ్యులకు అందించారు. మధ్యాహ్నం 12 గంటలప్రాంతంలో ముస్లిమ్ సంప్రదాయాలతో కలామ్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.