5వ తేదీ అని ముహూర్తంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు ఏ లగ్నంలో ప్రకటించారో గానీ… రిజల్టు బాగానే ఉంటున్నట్లుంది. ఒకవైపు జగన్ ఆంధ్రప్రదేశ్లో ఒక అంచున ఉన్న జిల్లాల్లోని ఎమ్మెల్యేలను బుజ్జగించి.. వారిని పార్టీలో కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే.. మరోవైపు రాష్ట్రం మరో చివరిలోని శ్రీకాకుళ: జిల్లానుంచి ఒక ఎమ్మెల్యే జారుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే వైకాపాకు చెందిన కలమట వెంకటరమణ తెలుగుదేశంలో చేరడానికి నిర్ణయించుకున్నారు. తన నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవడానికి ఆయన శుక్రవారం ఓ సమావేశం ఏర్పాటుచేశారు. ఆయన మార్చి నాలుగో తేదీలోగా.. తెలుగుదేశం పార్టీలో చేరిపోవచ్చునని వార్తలు వస్తున్నాయి.
కలమట వెంకటరమణ ప్రాథమికంగా తెలుగుదేశానికే చెందిన నాయకుడు. ఆయన తండ్రి తరం నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయన తండ్రి పాతపట్నంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీనుంచి తెలుగుదేశంలో చేరిన అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పాతపట్నం బరిలోకి దిగడంతో.. వెంకటరమణ తెలుగుదేశాన్ని వీడి.. వైకాపాలో చేరారు. అయితే.. ఇప్పుడు ఆయన తిరిగి తెదేపాలో చేరాలని తీసుకున్న నిర్ణయం.. తిరిగి సొంత ఇంటికి రావడం వంటిదే అని పలువురు భావిస్తున్నారు.
పార్టీని వీడిపోకుండా మిగిలిన 62 మందికి జగన్ ఒకవైపు హ్యాట్సాఫ్ చెప్పి వారిని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించినట్లు కనిపించడం లేదు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే ఫిరాయింపునకు సంబంధించిన వార్త ఖరారు అయింది. త్వరలోనే మరికొన్ని వలసలు కూడా తప్ప ఉంటాయని రాజకీయాల్లో చర్చలు సాగుతున్నాయి.