హైదరాబాద్: నిన్న షిల్లాంగ్‌లో కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు జాతిమొత్తం ఘనంగా నివాళులర్పిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారివరకు కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా దేశప్రజలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. కలామ్ బోధనలను, రచనలను, స్ఫూర్తిని తలుచుకుని ఆవేదన చెందుతున్నారు.
మరోవైపు ఆయన పార్థివదేహం ఈ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ప్రత్యేకవిమానంలో గౌహతినుంచి ఢిల్లీ చేరుకుంది. జాతీయ పతాకంతో కప్పిఉన్న కలామ్ భౌతికకాయాన్ని, ప్రముఖులు నివాళులు అర్పించటానికి వీలుగా పాలం విమానాశ్రయంలోనే ఒక వేదికపై ఉంచారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణమంత్రి మనోహర్ పారికర్, కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. ఇక్కడనుంచి మృతదేహాన్ని రాజాజీమార్గ్‌లో ఉన్న కలామ్ నివాసానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఈ సాయంత్రంవరకు భౌతికకాయాన్ని అక్కడే ఉంచుతారు. అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి. కుటుంబ సభ్యుల అభ్యర్థనమేరకు కలామ్ అంత్యక్రియలను రేపు రామేశ్వరంలోనే జరపాలని కేంద్రప్రభుత్వం ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది.