కాపుల రిజర్వేషన్ల గురించి ప్రభుత్వ స్పందన ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామనీ, కాపుల కోసం చాలా చేస్తున్నామనీ, రిజర్వేషన్ల అంశంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామనీ… ఇవే పడికట్టు వాక్యాలు ప్రతీసారీ వినిపిస్తూ ఉంటాయి! రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏదో ఒక కార్యాచరణ ప్రకటించగానే, డీజీపీ స్పందించడం అనేది పరిపాటి అయిపోయింది. ఈ నెల 26న పాదయాత్ర తలపెట్టనున్న నేపథ్యంలో దానికి అనుమతులు లేవని ఇప్పటికే డీజీపీ ఒకటికి రెండుసార్లు చెప్పేశారు. అది చాలదన్నట్టుగా ఏడాదిన్నర కిందట జరిగిన తుని ఘటనకు సంబంధించి త్వరలోనే ఛార్జిషీట్లు కూడా ఫైల్ చేస్తున్నట్టు చెప్పారు. ముద్రగడ ఉద్యమాన్ని మరోసారి అడ్డుకోవడానికి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇదే అంశం ఏపీ క్యాబినెట్ తాజా మీటింగ్ లో కూడా ప్రధానంగా చర్చకు రావడం గమనార్హం.
మంత్రి మండలి సమావేశంలో కాపుల రిజర్వేషన్ల ఇష్యూ చర్చకు వచ్చింది. అయితే, ఇచ్చిన హామీ ఎప్పట్లోగా నెరవేర్చగలం అనే చర్చ జోలికి పోకుండా… మంజునాథ కమిషన్ రిపోర్టు గురించి ముఖ్యమంత్రి అధ్యక్షతన చర్చించుకున్నారు. మంజునాథ కమిషన్ నివేదిక ఎందుకు ఆలస్యం అవుతోందన్న విషయంపై దృష్టి సారించారు. క్యాబినెట్ భేటీ తరువాత ఈ అంశం గురించి మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎనిమిది నెలల్లో నివేదిక ఇస్తారని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. అయితే, ఆ నివేదిక అందడంలో కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఆ జాప్యానికి గల కారణం కూడా ఆయనే చెప్పేశారు! ఆలస్యం ఎందుకంటే… ఇంకా బాగా లోతైన అధ్యయనం జరుగుతోందని, వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరిస్తోందనీ, వాటన్నింటికీ క్రోడీకరిస్తోందనీ మంత్రి వివరించారు. నివేదిక రూపకల్పనలో కమిషన్ నిమగ్నమై ఉందన్నారు. జస్టిస్ మంజునాథ తరఫున వివరణ కూడా మంత్రిగారే ఇచ్చేసినట్టు..!
మంజునాథ కమిషన్ నుంచి నివేదిక త్వరగా వచ్చేలా విజ్ఞప్తి చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది! లా సెక్రటరీతో ఒక లేఖ రాయించాలని డిసైడ్ అయ్యారు. త్వరలో ముద్రగడ మరోసారి ఉద్యమిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వచ్చిన స్పందన ఇదే! ఇక, ఈనెల 26 ముద్రగడ ఉద్యమించగానే ప్రభుత్వం తరఫున ఏం మాట్లాడబోతున్నారో ఇప్పుడే అర్థమైపోయింది. రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామనీ, అందుకే కమిషన్ వేశామనీ, నివేదిక త్వరగా వచ్చేందుకు లా సెక్రటరీ ద్వారా లేఖ కూడా రాశామని… ఈ ప్రయత్నాన్ని చెప్పుకుంటారు! అంతే, కాపుల రిజర్వేషన్లపై మరికొన్నాళ్లు తాత్సారం చేయడానికి కావాల్సిన కంటెంట్ చంద్రబాబు సర్కారు దగ్గర సిద్ధమైపోయింది..!