ఈమధ్య కాలంలో సోషల్ మీడియాని షేక్ చేసిన పాట `కళావతీ..`. ముందు ఈ పాట పెద్దగా ఎక్కలేదు. కానీ మెల్లమెల్లగా స్లో పాయిజిన్లా మారిపోయి.. మంచి కిక్ ఇచ్చింది. యూ ట్యూబ్లో రికార్డులన్నీ.. ఈ పాటవే. తమన్ మ్యూజిక్, సిద్ద్ మ్యాజిక్… రెండూ కలిసి.. ఈ పాటని సూపర్ హిట్ చేశాయి. అయితే ఈ పాట గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తమన్ పంచుకున్నాడు.
ప్రతీ పాటకూ.. పదుల సంఖ్యలో ట్యూన్స్ చేయడం, అందులో బెస్ట్ ట్యూన్ ఎంచుకోవడం సాధారణమైన విషయమే. కానీ.. కళావతీ.. ఫస్ట్ ట్యూన్కే ఓకే అయిపోయిన పాటని తమన్ చెప్పాడు. ట్యూన్ వినగానే ‘ఇది సూపర్ హిట్ అవుతుంది..’ అని పరశురామ్ చెప్పడంతో వెంటనే ఓకే చేశారు.
అయితే.. ఈ పాట పుట్టి రెండేళ్లయిపోయిందట. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్లో ఈ ట్యూన్ ఓకే చేశార్ట. దాన్ని రెండేళ్ల పాటు ఫ్రిజ్డ్లో దాచినట్టు దాచాల్సివచ్చిందని తమన్ చెప్పాడు. ”రెండేళ్ల పాటు.. పాటపై అదే ప్రేమ ఉండడం మామూలు విషయం కాదు. పాటని ప్రతీసారీ చెక్ చేసుకుని, ‘దీనికి ఇంకా ప్రాణం ఉందా, లేదా’ అని చర్చించుకునేవాళ్లం.. పాట ప్రేక్షకుల ముందుకు వచ్చేంత వరకూ.. అదే తపనతో పనిచేశాం. ఈ పాటపై నమ్మకం ఉండబట్టే.. రూ.30 లక్షలు ఖర్చు పెట్టి లిరికల్ వీడియో కూడా చేశాం. సిద్ద్ గొంతుతో ఈ పాటకు మరింత మైలేజీ పెరిగింది. ఇది వరకు కూడా సిద్ద్ నాకు పాటలు పాడాడు. కానీ వాటన్నింటికంటే భిన్నంగా ఈ పాటని కంపోజ్ చేశా. ఇవన్నీ కలిసి ఈ పాటని సూపర్ హిట్ చేశాయి..” అని తమన్ చెప్పుకొచ్చాడు.