తెలంగాణ ప్రభుత్వానికి ఒకేసారి భిన్నమైన అనుభవాలు ఎదురైనాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్దేశకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన అనుమతులు కేంద్రం నుంచి లభించాయి. ఢిల్లీలో మంత్రి హరీశ్ రావు చర్చల తర్వాత దీనికి సంబంధించిన సమాచారం అధికారికంగా అందింది. ప్రాజెక్టు పనుల కోసం కాల్వలు సొరంగాలు ఎత్తిపోతలు జలాశయాల వంటి వాటికోసం 8182 ఎకరాల అటవీ భూమి వినియోగించుకోవడానికి అనుమతి రావడంతో ప్రభుత్వం ఉపశమనం పొందింది. వీటిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు పన్నిన కుట్రలు విఫలమైనాయని హరీశ్ తదితరులు ప్రకటన చేశారు.
అయితే అదే రోజు హైకోర్టు ఉపాధ్యాయ నిమామక పరీక్ష(టిఆర్టి) కి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లబోవని తీర్పునిచ్చింది. పదిజిల్లాల ప్రాతిపదికగా గాక కొత్తగా విభజించిన 31 జిల్లాల పేరుతో టిఆర్టి నోటిఫికేషన్ విడుదల చేయడం చెల్లదని పాత పేర్లతో మరో ఉత్తర్వు నివ్వాలని ఆదేశించింది. పైగా రాష్ట్ర ప్రభుత్వ చర్య రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని స్పష్టం చేసింది. తన చర్యను సమర్థించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనలు కోర్టు తోసిపుచ్చింది. పైగా వీటిపై అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు. వాస్తవానికి దీనిపై మొదటి నుంచి సందేహాలు వ్యక్తం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు నడిచి దెబ్బతిన్నది. ఇప్పుడు కొత్త ఉత్తర్వులు దరఖాస్తులతో ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించడంలో సాద్యాసాధ్యాలు సమీక్షించి నిర్ణయం తీసుకోవలసి వుంటుంది.
కోదండరాం నాయకత్వంలోని జెఎసి తలపెట్టిన కొలువుల కొట్లాటకు అభ్యంతరం లేని తేదిలలో అనుమతినివ్వాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా రాజకీయంగా టిఆర్ఎస్కు మింగుడు పడేది కాదు.