యాభై ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇలా ఎందుకు వచ్చాయన్నదానిపై ఎవరికి వారు తమకు తోచిన విశ్లేషణలు చేస్తున్నారు. ఓ భూగర్భ శాస్త్ర వేత్త అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఓ కారణం అనేశారు. దానికి ఆయన చెప్పే కారణాలు ఆయన చెప్పారు. కానీ వినేవాళ్లకు ఇలాంటివి కాస్త అతిలా అనిపిస్తే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కాళేశ్వం అనేది ఒకే చోట నిర్మించిన ప్రాజెక్టు కాదు. అది ఎత్తిపోతల పథకం. నీళ్లు ఎత్తిపోయడానికే భూకంపాలు వస్తాయా అని ఎవరికైనా అనిపిస్తే అందులో తప్పేం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలు భూకంపాల జోన్ లో లేవు. ఇప్పుడు వచ్చింది కూడా రిక్టర్ స్కేల్‌పై ఐదు పాయింట్ల భూప్రకంపనలు మాత్రమే. భూమిలోపల ఇలాంటి ప్రకంపనలు సహజమేనని చాలా మంది భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అయితే ఈ సారి ఈ ప్రకంపనుల బయట కనిపించాయి. ప్రతి నాలుగైదు నెలలకోసారి ఉత్తర భారతంలో.. ఢిల్లీలో ప్రకంపనలు అని.. ప్రజలు భయంతో పరుగులు తీశారన్న ప్రచారం జరుగుతూనే ఉంటుంది.
కానీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త కావడంతో ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతోంది. దానికి కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించడం కాకుండా ఇలా కాళేశ్వరం అని.. మరొకటని చెప్పుకోవడం ద్వారా ఇష్యూని పొలిటికలైజ్ చేయడం తప్ప ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు కారణం అని.. చెప్పడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు.