సిద్దిపేటకు గోదావరి నీళ్లు తీసుకు రావాలనుకున్న కేసీఆర్ జల సంకల్పం.. ఫలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సిద్ధిపేటకు నీళ్లు అందించేందుకు నియమించిన రంగనాయక్‌సాగర్‌లోకి నీళ్లు చేరడం ప్రారంభించాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు.. రంగనాయకసాగర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. పది దశల ఎత్తిపోతల కాళేశ్వరంలో రంగనాయకసాగర్ ఏడో దశ. రంగనాయకసాగర్ పంప్‌హౌజ్‌లోని నాలుగుమోటర్లను కేటీఆర్, హరీష్ రావు ప్రారంభించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి ఉపనదిగా ఉన్న ప్రాణహిత ప్రధాన నదీగర్భాన్ని వేదికగా మలుచుకొని ఎత్తిపోస్తున్నారు. రంగనాయకసాగర్ నుంచి గోదావరి బేసిన్లోనే అతి ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన కొండపోచమ్మ జలాశయానికి ఎత్తిపోస్తారు. మే రెండో వారం కల్లా ఈ ప్రక్రియపూర్తి చేయాలని నిర్ణయించారు. కొండపోచమ్మసాగర్‌లోకి గోదావరిజలాలు అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ ఎత్తిపోతల పథకంగా రికార్డులకు ఎక్కుతుంది. 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు తో సిద్దిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రాజన్న, సిరిసిల్ల జిల్లాలోని మరో యాభై వైల ఎకరాలకూ నీరు అందుతుంది.
సిద్దిపేట.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాజకీయ పునాదులు వేసిన ప్రాంతం. దశాబ్దాల పాటు ఆయన అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తాను ఎంపీగా పోటీ చేయాల్సిన సమయంలో హరీష్ రావుకు నియోజకవర్గాన్ని అప్పగించారు. అప్పటి నుండి హరీష్ రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రజల చిరకాల కోరిక అయిన…సిద్ధిపేట కేంద్రంగా జిల్లాను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు గోదావరి జలాలు కూడా తీసుకొచ్చి.. పొలాలకు జలాభిషేకం చేస్తున్నారు.