సినిమా డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. ల్యాగ్ ని ఏ మాత్రం భరించడం లేదు ఆడియన్స్. మేకర్స్ కూడా ప్రేక్షకుడి నాడిని పట్టుకొని వారిని మెప్పించే విధంగా సినిమాలు చేస్తున్నారు. కాకపోతే సినిమాల్లో ఈ మార్పు వస్తోంది కానీ సినిమా ప్రమోషన్స్ లో అదే మూస ధోరణి ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ మూస ధోరణికి ‘కల్కి’ ఈవెంట్లు స్వస్తి పలికినట్లు కనిపిస్తున్నాయి.
కల్కి టీం ప్రమోషన్స్ లో సరికొత్త పంధాని అనుసరిస్తుంది. ఇప్పటివరకూ కల్కి సినిమా కోసం జరిగిన ఈవెంట్స్ ని గమనిస్తే ఓ యూనిక్ నెస్ కనిపిస్తోంది. అదే ..షార్ట్ అండ్ సూపర్. బుజ్జి భైరవ పేరుతో రామోజీ ఫిల్మ్ సిటీలో కనీవినీ ఎరుగనిరీతిలో ఓ గ్రాండ్ ఈవెంట్ పెట్టారు. నిజానికి ఇలాంటి ఈవెంట్ పెడితే.. ఓ పదిమంది చీఫ్ గెస్టులని పిలిచి సుధీర్గమైన ఉపన్యాసాలతో దంచికొట్టేయడం వెరీ కామన్. కానీ నాగ్ అశ్విన్ కొత్తగా అలోచించాడు. మనం చూపిస్తున్న కంటెంట్ ఏమిటి ? అది జనాల్లోకి వెళుతుందా లేదా ? అనే పాయింట్ పైనే ద్రుష్టి పెట్టాడు. జాతీయ మీడియా మొత్తం హాజరైన ఈ వేడుకలో కంటెంట్ ప్రజెంట్ చేసి గంటలోపే సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.
తర్వాత కల్కి యానిమేషన్ ఎపిసోడ్స్ ని లాంచ్ చేశారు. మీడియాని పిలిచి స్క్రీన్ చేశారు. నిజానికి ఇలాంటి ఈవెంట్ అయితే సినిమా యూనిట్ తో పాటు మరో పదిమంది గెస్ట్ లు స్టేజ్ పై స్పీచులు దంచేయడం కామన్. కానీ నాగీ మళ్ళీ కొత్తగా అలోజించాడు. ఈవెంట్ కి తానొక్కడే వచ్చాడు. మీడియాకి చెప్పాల్సిన మేటర్ ని కన్వే చేసి షార్ట్ అండ్ సూపర్ అనిపించాడు.
నిన్న ముంబైలో జరిగిన ఈవెంట్ కూడా సరికొత్తగానే సాగింది. అమితాబ్, కమల్, ప్రభాస్, దీపిక ఇలా సూపర్ స్టార్లలంతా హాజరయ్యారు.
నిజానికి ఇలాంటి వేడుకలు ఇక్కడైతే క్యాలెండర్ లో డేట్ మారిపోతుంది. ముందుగా ప్రతి స్టార్ నటించిన సినిమాల మెడ్లీ వుంటుంది. తర్వాత గ్రూపులు గ్రూపులుగా వచ్చి డ్యాన్సులు కడతారు. పిదప పొగడ్తల మాలతో తయారు చేసి ఏవీలు ప్రదర్శిస్తారు. అటుపిమ్మట సినిమా యూనిట్ అంతా ఆ స్టార్లని పొగుడుతూ ‘ఇంక ఆపండ్రా బాబూ’ అనంత వరకూ మైకులు వదలరు. ఇదంతా అయ్యేసరికి డేట్ మారిపోతుంది. పోనీ ఇంతా చేశాక సినిమా కంటెంట్ ఏమిటో జనాల్లోకి వెళ్ళిందా? అంటే అదేం వుండదు. కొన్నిసార్లు అయితే ఏ కంటెంట్ లేకుండా కేవలం స్పీచుల మీద ఆధారపడే ఈవెంట్లు నడిపిస్తుంటారు.
అయితే ఇలాంటి మూసకొట్టుడు ధోరణికి నాగ్ అశ్విన్ కల్కితో స్వస్తి పలికినట్లే కనిపిస్తుంది. నిన్న జరిగిన ఈవెంట్ లో ముందు ఏవీలు వేశారు. అవి కూడా అమితాబ్ కమల్ ప్రభాస్ దీపిక నటించిన కల్కి పాత్రలకు సంబధించినవే. తర్వాత సినిమా గురించి ఏం చెప్పాలో ఎంత చెప్పాలో ఒక స్కేల్ లో కొలిచినట్లు ఎలాంటి ల్యాగ్ లేకుండా చెప్పారు. రానా ఇంటరాక్షన్ కూడ పది నిమిషాల్లో ముగిసింది.
కల్కి ఈవెంట్లన్నీ పరిశీలిస్తే.. కంటెంట్ తప్పితే మరో టాపిక్ కి అవకాశం లేదు. అలాగే ల్యాగ్ కి కూడా చోటు లేదు. నిజానికి ఇది మంచి పద్దతి. సినిమా కంటెంట్ ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికే ఈవెంట్స్ ని వాడుకోవాలి. అవి కూడా ఆడియన్స్ కి విసుగు తెప్పించకుండా ప్లాన్ చేసుకోవాలి.
పెద్ద హీరో సినిమాలకి ఓపెన్ గ్రౌండ్స్ లో పెట్టిన ఈవెంట్స్ లో ఆటా పాట కాసేపు మాటలు ఉంటాయంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ హోటల్స్ పెట్టే ఈవెంట్స్ లో కూడా ఇదే మూసధోరణి కనిపిస్తోంది. ఒక హీరో సినిమా ఈవెంట్ జరిగితే ఆ హీరోతో టచ్ వుండే డైరెక్టర్స్ అంతా ఈవెంట్ కి వస్తారు. ఇక నిర్మాణ సంస్థలో సినిమా చేయబోయే దర్శకులు, హీరోలు కూడా హాజరైపోతారు. అయితే ఈ హడావిడంతా పీఆర్ కోసమే కానీ సినిమా కోసం కాదు. ఇందులో చాలా మందికి అసలు ఆ సినిమా కంటెంట్ ఏమిటో కూడా తెలిసుండదు. ఇలాంటప్పుడు సదరు సినిమాకి చేకూరే ప్రయోజనం ఏమీ వుండదు.
అన్నిటికి మించి… ప్రస్తుతం మారిపోయిన డైనమిక్స్ ప్రకారం ల్యాగ్ వుంటే రెండు గంటల సినిమానే ప్రేక్షకులు భరించడం లేదు. అలాంటిది గంటల కొద్దిసాగే ఈవెంట్స్ ఎవరు చూస్తారనే ? మినిమమ్ లాజిక్ తో ఆలోచిస్తే .. సినిమా ఈవెంట్లు మరింత క్రియేటివ్ గా జరిగే అవకాశం వుంటుంది.