గురువారం విడుదలైన ‘కల్కి’ ప్రపంచ వ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకొంది. కొత్త రికార్డుల దిశగా వడివడిగా అడుగులేస్తోంది. సినిమా నిడివి కూడా ఎక్కువే. దాదాపు 3 గంటల రన్ టైమ్ ఉంది. ఫస్టాఫ్‌లో కొంత ట్రిమ్ చేస్తే బాగుండేదన్న సలహాలు వినిపించాయి. అయితే.. నిజానికి కల్కి రన్ టైమ్ 3గంటల 20 నిమిషాలట. మరో 20 నిమిషాల ఫుటేజ్‌ని కావాలనే పక్కన పెట్టారు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘కాంప్లెక్స్’కి సంబంధించిన కొంత ఫుటేజ్, బ్రహ్మానందం – ప్రభాస్‌ల మధ్య కామెడీ సీన్లు, దుల్కర్ సల్మాన్ తో ఎమోషనల్ సీన్ ఇవన్నీ చివరి నిమిషంలో తొలగించారని తెలుస్తోంది. లేదంటే ఈ సినిమా 3 గంటల 20 నిమిషాలు వచ్చేదే.
ఈ 20 నిమిషాల ఫుటేజీ ఓటీటీ లో చూసే అవకాశం ఉందని టాక్. అమేజాన్ ప్రైమ్‌కి ఈ సినిమా ఇచ్చేశారు. సినిమాకి మంచి టాక్ ఉంది కాబట్టి, ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఎప్పుడొచ్చినా తెరపై చూడని కొన్ని అదనపు సన్నివేశాల్ని ఓటీటీ వేదికపై చూసే ఛాన్సుంది. ఈ చిత్రానికి ‘పార్ట్ 2’ ఉంటుందన్న విషయంలో క్లైమాక్స్ లో స్పష్టత ఇచ్చారు. అయితే పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఓ నెలరోజులు గ్యాప్ తీసుకొని, పార్ట్ 2 పనులు మొదలెట్టే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘కల్కి’ తొలి భాగంలో కమల్ హాసన్ పాత్రని పెద్దగా చూపించలేదు. పార్ట్ 2లో మాత్రం కమల్ పాత్ర బాగా ఎలివేట్ అయ్యే ఛాన్సుంది.