‘కల్కి’ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అది సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. దానికి తోడు కల్కి టీమ్ దగ్గర ప్రమోషన్ కంటెంట్ కావల్సినంత ఉంది. విడుదలకు ముందు వారం రోజుల నుంచి ఆ కంటెంట్ అంతా గుమ్మరిస్తున్నారు. ఇప్పుడు ‘కల్కి’ నుంచి ఓ పాట వచ్చింది. ఇది పాట అనడం కంటే, ‘కల్కి’ సారాంశం అనడం సబబు. ‘కల్కి’ కథ, అందులోని పాత్రలు, వాటి మధ్య ఘర్షణ.. ఇవన్నీ పొందు పరిచారు ఈ గీతంలో. చంద్రబోస్ ఎప్పటిలానే తన సాహిత్యంతో.. అబ్బుర పరిచారు. ‘కల్కి’ ఆగమనాన్ని అక్షరాల్లో ఆవిష్కరించారు. సంతోష్ నారాయణ్ స్వర పరిచిన ఈ పాటని కాలభైరవ హృద్యంగా ఆలపించారు.
”అధర్మాన్ని అణిచేయ్యగ.. యుగయుగాన జగములోన
పరి పరి విధానాల్లో విభవించే విక్రమ విరాట్రూపమితడే” అంటూ ఈ పాట మొదలైంది. ప్రతీ చరణంలోనూ, ప్రతీ పదంలోనూ కల్కి రాకను స్వాగతిస్తూ.. సాహిత్యం సాగింది.
”మీనమై పిదప కూర్మమై.. తను వరాహమై మనకు సాయమై” అంటూ దశావతారాలనూ పదాల్లో ఆవిష్కరించారు.
”కలియుగ స్థితిలయలే కలబోసే కల్కితడే” అంటూ ఒక్క మాటలో `కల్కి` క్యారెక్టర్ మొత్తం పట్టేశారు చంద్రబోస్.
”ప్రార్థనో మధుర కీర్తనో
హృదయ వేదనో మన నివేదనం
అందితే మనవి తీక్షణం.. మనకు సంభవం అతని వైభవం” అంటూ పరుగులు పెట్టింది చంద్రబోస్ కలం.
మొత్తానికి పాట అర్థవంతంగా సాగింది. ‘కల్కి’ థీమ్ మొత్తాన్ని ఈ పాటలో పొందుపరిచే ప్రయత్నం చేశారు. ఈ పాటతో `కల్కి`పై ఆశలు, అంచనాలూ మరింతగా పెరగడం ఖాయం.