‘కల్కి’తో నాగ అశ్విన్ ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నాడన్నది ముందే అర్థమైంది. మరింతకీ ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? అందులో మనుషులు, వాళ్ల కథలు, వాళ్ల గాధలు, వాళ్ల యుద్ధాలు ఎవరితో? ఇవన్నీ ప్రశ్నలే. ఈ చిక్కుముడులకు ‘కల్కి’ ట్రైలర్‌తో సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది చిత్రబృందం.
ప్రభాస్ కథానాయకుడిగా, వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రమిది. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. ఈరోజు ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్లో ‘కల్కి’ ప్రపంచం ఎలా ఉండబోతోందో చూపించేశారు. ”కావాలంటే రికార్డులు చూసుకో.. ఇప్పటి వరకూ ఒక్క ఫైట్ కూడా ఓడిపోయలేదు, ఇది కూడా ఓడిపోను” అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ హీరోయిటిక్గా, అభిమానులకు నచ్చేలా ఉంది. ప్రపంచానికి ఓ ఆపద వస్తోందని, దాన్ని భైవర ఒక్కడే ఆపగలడని, అదెలా అన్నదే ఈ కథ అని ట్రైలర్ చూస్తే చూచాయిగా అర్థం అవుతోంది. దీపికా పదుకొణె పాత్రనీ బలంగానే డిజైన్ చేశారు. ఆమె పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అమితాబ్ గెటప్, ఆయన ప్రజెన్స్ అద్భుతంగా కుదిరాయి. కమల్ హాసన్ పాత్రని కూడా ట్రైలర్లోనే పరిచయం చేశారు. ఆయుధాలు, వాహనాలు, యుద్ధాలు… ఇవన్నీ సరికొత్తగా ఆవిష్కరించారు ఈ సినిమాలో. హాలీవుడ్ సినిమాల స్థాయిలో మేకింగ్ ఉంది. భైరవ పాత్రని ఓ సూపర్ హీరో స్థాయిలో డిజైన్ చేశారు. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ కథలు ఇష్టపడేవాళ్లకు, యాక్షన్ ప్రియులకు ఈ సినిమా బాగా నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 27న ‘కల్కి’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.