తెలుగు360 రేటింగ్: 2.5/5
హీరోయిజం వేరు.. హీరోగా కనిపించి, అనిపించి, మెప్పించడం వేరు.
కల్కి లాంటి పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకుని, కల్కావతారం మాదిరిగానే దుష్టశిక్షణ ను నిర్దాక్షిణ్యంగా చేపట్టేందుకు వీలు అయిన కథను తీసుకోవడం వరకు హీరోయిజానికి పనికి వచ్చే వ్యవహారం.
కానీ అదే పాత్రలో హీరో, హీరోలా కనిపించి, అనిపించి, మెప్పించగలగాలి. అప్పుడే ప్రేక్షకుడు కథతో కనెక్ట్ కావడానికి వీలుంటుంది. దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే సినిమాకు కాస్టింగ్ పెర్ ఫెక్ట్ గా వుండడం అన్నమాట.
కల్కి సినిమాకు ప్రధానమైన మైనస్ ఇదే. సీనియర్ హీరో రాజశేఖర్ ను ఆధునిక సాంకేతిక ఉపయోగించి అందంగా చూపించడం వరకు ఓకె. కానీ ఆయనలో ఒకప్పటి చలాకీ తనం కానీ, చురుకుదనం కానీ, అంత్యంత సహజంగా వుండే నటన కానీ, అగ్రెసివ్ నెస్ కానీ కలికంలోకి కూడా కనిపించవు కల్కి సినిమాలో. సినిమాలో వున్న అనేకానేక పాత్రలకు సరిపడా నటులను ఏరికోరి తెచ్చుకున్నారు. కానీ హీరో, హీరోయిన్ల దగ్గర బోల్తా పడ్డారు. రాజశేఖర్ కనీసం అందంగా అన్నా కనిపించాడు. హీరొయిన్ ఆదాశర్మ మాత్రం అది కూడా లేదు. ఆమె బేలచూపులు, ఆమెకు పెట్టిన విగ్ చూస్తుంటే ఇది సినిమానా? డ్రామా నా? అనిపిస్తుంది.
అసలు ఇలాంటి హీరో హీరోయిన్లు వున్న కల్కి కథ సాదా..కథనం మాత్రం కాస్త వైవిధ్యం. ఓ ఊరిని తన గుప్పిట్లో వుంచుకున్న నరసప్ప (అశుతోష్ రాణా ) తమ్ముడు శేఖర్ బాబు ను ఎవరో హత్య చేస్తారు. ఇది తన శతృవు పెరుమాళ్లు పని అని ఆ వర్గాన్ని మొత్తం లేకుండా చేస్తాడు నరసప్ప. కానీ పెరుమాళ్లు మాత్రం తప్పించుకుంటాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసును విచారించడానికి వస్తాడు పోలీస్ అధికారి కల్కి (రాజశేఖర్). ఆ విచారణ ఎలా సాగింది? ఏం తేలింది? అన్నది మిగిలిన కథ.
కల్కి కథగా చూసుకుంటే కాస్త సాదాసీదా, లేదా తెలిసిన కథనే. కానీ ఈ కథకు యంగ్ డైరక్టర్ ప్రశాంత్ వర్క్ కాస్త డిఫరెంట్ స్క్రీన్ ప్లే అందించి, నవ్యతను జోడించే ప్రయత్నం చేసాడు. కొద్ది కొద్దిగా ఇల్లాజికల్ సీన్లు, సినిమాటిక్ లిబర్టీ వున్నా, టోటల్ గా స్క్రిప్ట్ అల్లిన వైనం బానే వుంది. అయితే మాంచి ట్విస్ట్ లు వున్న సస్పెన్స్ థ్రిల్లర్ ను డీవీయేట్ చేసే కొన్ని సీన్లు మాత్రం ఈ ఫ్లోను దెబ్బ తీసాయి. ముఖ్యంగా హీరో-హీరోయిన్ల ప్రేమ వ్యవహారం కోసం రెండు యాక్షన్ ఎపిసోడ్ లు, ఇంకా ఇతరత్రా సీన్లు చాలా నీరసం తెప్పిస్తాయి. అసలు హీరో లవ్ ట్రాక్ అన్నదే లేకుండా స్క్రిప్ట్ ను రీ డిజైన్ చేసుకుని వుంటే చాలా బాగుండేది. అలాగే సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో ప్రేక్షకులను తప్పదారి పట్టించడానికి ఒకటి రెండు హర్రర్ ఎలిమెంట్లు జోడించడం కూడా బాగా లేదు.
సినిమా ఫైనల్ కాపీ ఎడిట్ లో కనీసం ఈ హర్రర్ సీన్లు లేపేసి వుండాల్సింది. ఇటీవల కొత్త తరం మేకర్లు సినిమాలోకి అనవసరంకా పాటలు, పాత్రలు తీసుకురావడం లేదు. దర్శకుడు ప్రశాంత్ వర్క కూడా నవతరం దర్శకుడే కానీ, హీరో రాజశేఖర్ కోసం కొంత వెనక్కు తగ్గాడో?లేదా రాజీపడ్డాడో?
సినిమా ఫస్ట్ హాఫ్ తొలి ఇరవై నిమషాలు సినిమా కాస్త ఆసక్తికరంగానే వుంటుంది. కానీ రాను రాను మెలమెల్లగా డయిల్యూట్ కావడం మొదలవుతుంది. ఈ వ్యవహారం కారణంగా తొలిసగం సినిమా అంత గొప్ప మార్కులు తెచ్చుకోదు. హీరో ద్వారా కన్నా విలేకరి పాత్రధారి రాహుల్ రవీంద్రన్ ద్వారా ఎక్కవ చెప్పాలన్న ప్రయత్నం కూడా అంతగా ఆకట్టుకోదు.
సినిమా ద్వితీయ సగంలోకి ప్రవేశించాక ప్రారంభంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్, ఆ వెంటనే వచ్చే అయిటమ్ సాంగ్ కూడా స్పీడ్ బ్రేకర్ లే. ఈ పదిహేను నిమషాల గండం గడిచిన తరువాత సినిమా గాడిన పడుతుంది. ఇంక మిగిలిన సినిమా అరగంటకు కాస్త అటుగా కాబట్టి, చిక్కుముడులు అన్నీ విప్పుకుంటూ వెళ్తారు. దాంతో సినిమా కాస్త ఆసక్తిగా వుంటుంది. చివరగా వుండే అరగంట సినిమాలోనే బోలెడు మలుపులు కూడా వుంటాయి. అవన్నీ కూడా కాస్త ఆసక్తికరంగానే వుంటాయి. సినిమా అయిపోయింది అని అనుకున్న తరువాత కూడా మరో ట్విస్ట్ యాడ్ చేయడం అన్నది బాగుంది.
కానీ తొలిసగాన్ని, మలిసగంలో తొలి ఇరవై నిమషాలను భరించిన ప్రేక్షకుడు ఈ చివరి అర్థగంటను కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతాడు తప్ప, సినిమా అదిరిపోయింది అని మాత్రం అనుకోడు. దీనికి తోడు ‘తిలకాష్ఠ మహిష బంధన’ అన్నట్లుగా, ఇంత పెద్ద ఎత్తున విలనిజం, ఇంత భయంకరంగా మర్డర్లు అన్నీ, ఇందుకోసమా? అన్నట్లు వుంటుంది. అసలు కథలో దాచిపెట్టిన పాయింట్. దానికి తగినట్లే వుంటుంది క్లయిమాక్స్ కూడా. అంత భయంకరమైన విలనిజం,నెట్ వర్క్ వున్న విలన్ ముగింపు అంత సాదాసీదా గా ప్లాన్ చేయడం సినిమాకు తగినట్లు వుండదు.
సినిమాకు హీరో, హీరోయిన్లు తప్ప మిగిలిన నటులంతా ఓకె. ముందే చెప్పుకున్నట్లు రాజశేఖర్ కాకుండా మరే సీనియర్ లేదా యంగ్ హీరోలు చేసి వున్నా ఈ సినిమా అవుట్ పుట్ వేరుగా వుండేదేమో? మిగిలిన పాత్ర ధారులంతా బాగా చేసారు.
సినిమాకు పెద్ద బలం టెక్నికల్ వర్క్ నే. సినిమాటోగ్రఫీ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు బాగుంది. ప్రతి ఫ్రేమ్ ను రెగ్యులర్ యాంగిల్ లో కాకుండా కాస్త డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం, లోకేషన్ కు తగిన లైటింగ్ అన్నీ కలిసి సినిమాను మాంచి రిచ్ గా అందించాయి. సన్నివేశాలకు మూడు వంతులు బలం రీరికార్డింగ్ నే. ఈ రెండు సపోర్ట్ లు లేకపోతే, సినిమా కనీసం ఈ రేంజ్ కు వచ్చి వుండేది కాదు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ తనలో కాస్త విషయం వుంది అని నిరూపించుకున్నాడు. తొలి సినిమా వేరు ఈ సినిమా వేరు. ఇది పక్కా కమర్షియల్ ఫార్మాట్ మూవీ. ఇవి కూడా తను డీల్ చేయగలను అనిపించుకున్నాడు. కానీ స్క్రిప్ట్ ను మరి కాస్త ఫైన్ ట్యూన్ చేసి, హీరో లవ్ ట్రాక్ ను నిర్మొహమాటంగా తీసేసి వుంటే ఇంకా బాగుండేది. కానీ సీనియర్ హీరో కాబట్టి, అతనికి ఆ ఫ్రీడమ్ దొరికి వుండదు.
ఫినిషింగ్ టచ్…పాత..కొత్తల..సాదా కలయిక.
తెలుగు360 రేటింగ్: 2.5/5