ఒకరు మరొకరిపై సెటైర్ వేయడం కామన్. తనపై తనే సెటైర్ వేసుకుంటేనే వెరైటీ. రాజశేఖర్ ఇప్పుడు అలాంటి వెరైటీ పనే చేశాడు. రాజశేఖర్‌పై బోలెడన్ని పేరడీలూ, గారడీలు. ‘గబ్బర్ సింగ్’లో ‘ఏం చెప్తిరి ఏం చెప్తిరి’ అంటూ పవన్ కల్యాణ్ రాజశేఖర్‌ని ఇమిటేట్ చేయడం ఎవ్వరూ మర్చిపోరు. అప్పటి నుంచీ… ఆ డైలాగ్ మహా పాపులర్ అయిపోయింది. రాజశేఖర్ డాన్సింగ్ అంటే ఓ ట్రేడ్ మార్క్ స్టెప్పొకటి ఉంటుంది. జబర్ దస్త్ గ్యాంగ్ ఎప్పుడూ ఈ స్టెప్పుని వేస్తూనే ఉంటారు. రెండు చేతులూ, కాళ్లూ ఓ రిథమ్ప్రకారం ఊపితే రాజశేఖర్ స్టెప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండిటినీ `కల్కి` సినిమాలో చూపించాడు రాజశేఖర్. అది కూడా కామెడీగా.
‘అ’ సినిమాతో ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. తన రెండో సినిమాగా ‘కల్కి’ని తెరకెక్కించాడు. గరుడ వేగ తరవాత.. రాజశేఖర్ నుంచి వచ్చే సినిమా ఇది. ఆ హిట్‌తో ట్రాక్ ఎక్కడం వల్ల ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని ముందు నుంచీ నిలబెట్టుకుంటూనే ఉన్నాడు ప్రశాంత్ వర్మ. టీజర్‌తో దుమ్ము రేపిన ప్రశాంత్ వర్మ.. ట్రైలర్‌తోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. భగవద్గీతలో కర్మ సిద్దాంతం వినిపిస్తూ సీరియస్‌గా మొదలైన ట్రైలర్ రాజశేఖర్ చెప్పిన `ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి` డైలాగ్‌తో కామెడీ మోడ్‌కి వచ్చింది. ఆ తరవాత మళ్లీ యాక్షన్ బిట్లతో ఉత్కంఠత కలిగించారు. చివర్లో రాజశేఖర్ డ్రేడ్ మార్క్ డాన్స్‌ని రాజశేఖర్ తోనూ, రాజశేఖర్ డూప్ తోనూ వేయించి ఓ స్పార్క్ లాంటి ముగింపు ఇచ్చాడు. ఈ ట్రైలర్లోనూ కథేం చెప్పలేదు. కాకపోతే సినిమా చూడాలన్న ఉత్సుకత మాత్రం కలిగించాడు. నిర్మాణ విలువలు, కాస్టింగ్, నేపథ్య సంగీతం బాగుండడం కలిసొచ్చే అంశం.