కొండపోచమ్మ సాగర్ కాలువకు పడిన గండిని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాజకీయంగా ఉపయోగపడుతోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు అతి సమీపంలో ఉండే వెంకటాపూర్ గ్రామాన్ని ఆ నీరు ముంచెత్తింది. అయితే.. సమస్య అది కాదు.. ఇప్పుడు … కాంగ్రెస్ రాజకీయం మొత్తం.. ఆ కాలువను నిర్మించిన కాంట్రాక్టర్ చుట్టూనే తిరుగుతోంది. అందులోని విషయాలన్నీ బయటకు తీస్తే.. పార్టీ ఫిరాయింపుల కోణం కూడా బయటకు వస్తోంది. దీంతో.. కాంగ్రెస్ నేతలకు కొత్త ఉత్సాహం పుట్టుకు వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ టెండర్ ..మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి దక్కింది. కానీ ఆ కంపెనీ చాలా పనులను.. సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చింది.
ఇలా కొండ పోచమ్మ సాగర్ పనులను..కూడా.. వేరే కంపెనీకి ఇచ్చింది. ఆ కంపెనీ నాసిరకం పనులు చేయడంతో ప్రారంభించిన ఒకటి, రెండు రోజుల్లోనే గండి పడింది. ఇప్పుడు ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వెలికి తీసింది. తీరా చూస్తే.. ఆయన ఫిరాయించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అనే విషయం బయటపడింది. దీంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇలా కాంట్రాక్టులు ఆశ చూపి.. పార్టీలో చేర్చుకున్నారని.. వారు నాసికరం పనులు చేసి.. ప్రజా ధనం కొల్లగొట్టారని ఆరోపిస్తున్నారు. ఇది పెద్ద స్కాం అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.
గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో మెజార్టీ టీఆర్ఎస్ లో చేరిపోయారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్లకి పదవులు.. ఇతరులకు కాంట్రాక్టులు.. వచ్చాయని చెబుతున్నారు. ఇప్పుడు ఎవరెవరికి ఎలాంటి లబ్ది కలిగిందో.. బయటకు తీసి ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. ప్రజాధనం దోచి.. ఫిరాయింపులకు ఉపయోగించారనే విషయాన్ని హైలట్ చేయాలనే నిర్ణయించుకున్నారు.