కల్వకుంట్ల కవిత ఓ ఇంటర్యూలో పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని వ్యాఖ్యానించేశారు. మిగతా ఏపీ నేతల గురించి పాజిటివ్ గా చెప్పి ఒక్క పవన్ కల్యాణ్ గురించే ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆమెపై జనసైనికులు మండిపడుతున్నారు. క్షుద్ర రాజకీయాలు చేసే జగన్ రెడ్డిలో కూడా ఫైటర్ ను చూసిన ఆమె.. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న పవన్ విషయంలో ఎందుకంత వ్యతిరేకంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు.
పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పడానికి కవిత ఇంటర్యూలో కొన్ని కారణాలు చెప్పారు. చేగువేరాను ఇష్టపడే వ్యక్తి కంప్లీట్ రైటిస్ట్గా ఎలా మారడానేది తనకు తెలియడం లేదన్నారు. దీనికి పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగానే సమాధానం ఇచ్చారు. చేగువేరా పోరాట తత్వాన్ని తాను అభిమానిస్తానని అలాగే సనాతనధర్మంలోని అంశాలను పాటిస్తానన్నారు. మానవత్వమే తన విధానమని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఆయన చేసే రాజకీయ వ్యాఖ్యలు కూడా ఆయనకు ఆయనే విభేధించుకునేలా ఉంటాయని కవిత చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇలా మాట్లాడే పవన్ కల్యాణ్… రేపు తమిళనాడు వెళ్తే హిందీ అమలు చేయడానికి వీల్లేదని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఆ మాటకొస్తే రాజకీయ నేతలంతా ఒకే మాట మీద ఉన్నట్లుగా.. బీఆర్ఎస్ పార్టీ పెద్దలంతా అదే పని చేసినట్లుగా కవిత చెప్పుకొచ్చారు. ఈ కారణాలతోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నేను స్పందించాలని అనుకోవడం లేదు. ఆయన సీరియస్ పొలిటీషియన్ అని భావించడం లేదన్నారు.
కవిత మాటలు చూస్తే.. పవన్ పోరాటాన్ని ఆమె గుర్తించడానికి సిద్ధంగా లేనట్లుగా ఉన్నారు. ఈ వ్యతిరేకత ఎందుకో కానీ.. పవన్ కల్యాణ్ ఎప్పుడూ కల్వకుంట్ల కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. వారి రాజకీయాన్ని తప్పు పట్టలేదు. అందుకే తెలంగాణను వ్యతిరేకించిన తమ ఆప్తమిత్రుడికి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసినందుకు కవితకు వ్యతిరేకత బాగా ఉన్నట్లుగా ఉందని జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు.