అఖండ భారతంలో అదానికో న్యాయం…ఆడబిడ్డకో న్యాయమా ? అని ప్రధాని మోదీని కవిత ప్రశ్నించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలి సారి రాజకీయపరమైన ట్వీట్చేశారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని మండిపడ్డారు. తర్వాత ఇంగ్లిష్లో మరో ట్వీట్ పెట్టారు. అఖండ భారత్ సాధిస్తామని ప్రచారం చేశారని చివరికి సెలక్టివ్ న్యాయం పాటిస్తున్నారని మండిపడ్డారు. అదానీపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో కవిత చాలా కాలం ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ పై విడుదలైనప్పటి నుండి పూర్తిగా రాజకీయాల విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. అదే సమయంలో పార్టీ కార్యక్రమాలలోనూ పాల్గొనడం లేదు.అయితే హఠాత్తుగా అదానీ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రధాని మోదీనే ప్రశ్నిస్తూ లేఖ రాయడం సంచలనంగా మారింది.
భారత్లో విద్యుత్ ఒప్పందాల విషయంలో అదానీ పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చిందని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో కేసు నమోదు అయింది. అమెరికా నుంచి తప్పుడు మార్గాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇలా చేశారని ఆరోపణ. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదానీని అరెస్టు చేసిస విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కవిత ఇప్పుడు సైలెన్స్ బ్రేక్ చేయడం అనూహ్యమేనని మోదీతో..బీజేపీతో తాడోపేడో తేల్చుకుందామని డిసైడయ్యారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.