ప్రస్తుత రాజకీయాల్లో తొందరపాటు అనేది పనికిరాదు. ముఖ్యంగా పేరెన్నికగల నాయకులకైతే వివేకం, ఆలోచన చాలా ముఖ్యం. లేదంటే పార్టీలో, ప్రజల్లో పలుచనవడమే కాదు వారి మాటలకు విలువ లేకుండా పోతుంది. అప్పటివరకు సంపాదించుకున్న పేరు గంగలో కలిసిపోతుంది. ఇప్పుడు కల్వకుంట్ల అన్నాచెల్లెలు కేటీఆర్, కవితకు అదే జరుగుతోంది
ఇంతకీ విషయం ఏంటంటే…హైదరాబాద్ లో మార్చి 22న ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం జరిగినటు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదంటూ కేటీఆర్ , కవిత వెంటనే ట్వీట్లు చేశారు.
రేవంత్ హోంమంత్రిగా ఉన్నా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. దీంతో రైల్వే పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేగంగా కదిలారు. రైల్లో అత్యాచార యత్నం ఘటనను సీరియస్ గా తీసుకొని అనుమానితుల్ని ప్రశ్నించారు. కానీ, ఒక్క క్లూ దొరకలేదు.
యువతి పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నిస్తే అసలు విషయం కక్కింది. రీల్స్ కోసం వీడియో చేస్తుండగా రైలు నుంచి జారిపడ్డానని,ఈ విషయం ఇంట్లో తెలిస్తే మందలిస్తారని భయంతో అత్యాచారయత్నం నాటకం ఆడినట్లు చెప్పింది. దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా కేటీఆర్ , కవితను సామజిక మాధ్యమాల్లో ఓ ఆట ఆడుకుంటున్నారు. ముందు విషయం తెలుసుకొని ట్వీట్లు పెట్టాలని హితవు పలుకుతున్నారు.
అత్యాచారయత్నం జరిగిందని యువతి చెప్పగానే కేటీఆర్ , కవితలు ట్వీట్ చేయడం తప్పేం కాదు. కానీ, అసలు జరిగిన విషయం ఏంటి అని తెలుసుకోకుండా, అత్యుత్సాహం ప్రదర్శించారని అంటున్నారు. ఎందుకంటే , గతంలో మిర్చి రైతుల విషయంలోనూ కేటీఆర్ ఇలాగే అత్యుత్సాహంతో వ్యవహరించారు. మిర్చి పంటకు ధరను పెంచాలని కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు విమర్శించే వీడియోనే.. ఇప్పుడు రేవంత్ ను విమర్శిస్తున్నారని కేటీఆర్ పోస్ట్ చేశారు.
అది కాంగ్రెస్ కు పెద్ద ట్రోలింగ్ స్టఫ్ అయింది. అంటే..విషయం ఏదైనా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఎజెండాతోనే ట్వీట్లతో కేటీఆర్ విరుచుకుపడుతున్నారు తప్పితే వాస్తవాల ప్రాతిపదికన ఎక్స్ పోస్టింగ్ లు లేవనేది కాంగ్రెస్ చేస్తున్న వాదనకు ఆ ట్వీట్ బలం చేకూర్చింది. ఇప్పుడు రైలు ప్రమాదంలో తన తప్పిదంతోనే యువతి గాయపడిన వ్యవహారంలో ముందు వెనక ఆలోచించకుండా అన్నా చెల్లెళ్లు ట్వీట్లు చేశారని, నిజానిజాలు తెలుసుకోవాలని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.