ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వకూర్తి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ మాత్రం ప్రజల తీర్పు విలక్షణంగా ఉంటుంది. రాజకీయ దిగ్గజం జైపాల్ రెడ్డికి ఈ నియోజకవర్గం కంచుకోట లాంటిది. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి… ఎన్టీఆర్కు కూడా రాజకీయంగా సవాల్ చేశారు జైపాల్ రెడ్డి. 1989లో సాక్షాత్ ఎన్టీ రామారావు కూడా కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లాలో ఏడింటిలో టీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన ఏడింటిలో ఆరు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. కానీ కల్వకుర్తిలో మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. బీజేపీ నుంచి పోటీచేసిన ఆచారి..అత్యంత స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో లక్షా 99 వేల 714 మంది ఓటర్లున్నారు..2014 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి..బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. వంశీచంద్ రెడ్డి కి 42 వేల 782 ఓట్లు రాగా… బీజేపీ అభ్యర్థి ఆచారికి 42 వేల 704 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ 29 వేల 844 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2014 లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన కసిరెడ్డి నారాయణరెడ్డి 24 వేల ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి..ఎడ్మ కిష్టారెడ్డి, బాలాజీసింగ్ ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్నా…కసిరెడ్డి నారాయణరెడ్డి మాత్రం రెబెల్ గా పోటీచేసేందుకు రెడీ అవుతున్నారు. కల్వకుర్తి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పుకోవచ్చు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ …టీడీపీ అభ్యర్థి ఎన్టీరామారావుపై విజయం సాధించారు. ఎన్టీఆర్ ను ఓడించిన గడ్డగా కల్వకుర్తి చరిత్రకెక్కింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్ లో చిత్తరంజన్ దాస్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
1994 లో స్వతంత్ర్య అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి విజయం సాధించారు. 1999 లో టీడీపీ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపొందారు.2004 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎడ్మ కిష్టారెడ్డిని రెండోసారి విజయం వరించింది. 2009 లో టీడీపీ నుంచి పోటీ చేసిన జైపాల్ యాదవ్ ను రెండో సారి గెలుపు వరించింది. 2014 లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి 78 ఓట్ల తేడాతో అనూహ్య విజయం సాధించారు.దాంతో చల్లా వంశీచంద్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిచ్చి ఏఐసీసీ కార్యదర్శి గా నియమించింది. బీజేపీ క్యాడర్ బలంగా ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలో తల్లోజు ఆచారీ బలమైన అభ్యర్థిగా పోటీలో నిలవబోతున్నారు. జైపాల్ యాదవ్ గెలుపు కోసం మంత్రి జూపల్లి పావులు కదుపు తున్నారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి… ఆతర్వాత టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీగా గెలుపొందారు. కల్వకుర్తి నియోజకవర్గంలో సొంత క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. కల్వకుర్తి నుంచి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ కసిరెడ్డిపైనే అందరి దృష్టి ఉంది. గెలుపోటముల్ని కసిరెడ్డి డిసైడ్ చేయనున్నారు.