చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వారాహి చలన చిత్రం సంస్థ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా మొదలైంది కూడా. ఇప్పుడు షూటింగ్ కూడా షురూ అయ్యింది. ఈరోజు హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేశారు. మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాకేష్ దర్శకుడు. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణుల టీమ్ కూడా పక్కాగా కుదిరింది. బాహుబలి కెమెరామెన్ సింథిల్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నాడు. యోగేష్ సంగీతం అందిస్తున్నాడు. రంగస్థలం లాంటి పెద్ద సినిమాలకు పనిచేస్తున్న రామకృష్ణ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. బలమైన కథకు అదనపు హంగులు జోడిస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. మరోవైపు చిరు, చరణ్‌లు కూడా తమ వంతు సలహాలూ, సూచనలు అందిస్తున్నారు. మరి మెగా అల్లుడు ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.