చిరంజీవి అల్లుడిగా `విజేత`తో ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్ దేవ్. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. చిరు అల్లుడి సినిమా అయ్యుండి ఆ సినిమాకి ప్రమోషన్లు చాలా దారుణంగా చేశారు. రెండో సినిమా నుంచైనా బెటర్ అవుతుందనుకున్నారంతా. కానీ `సూపర్ మచ్చీ` పేరుతో ఓ సినిమా మొదలెట్టారు. అది కూడా అర్థాంతరంగా ఆగిపోయిందని తెలుస్తోంది. ఆ సినిమా సెట్స్‌పై ఉన్న సంగతి కూడా చాలామందికి తెలీదు. ఇప్పుడు మరో సినిమా ప్రకటించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ఈ సినిమా రూపొందించడం సంతోషమే అయినా, దర్శకుడిగా శ్రీధర్ సీపాన ని ఎంచుకోవడం చూస్తుంటే చిరు అల్లుడి సినిమాల స్ట్రాటజీ అయోమయంగా మారింది.
శ్రీధర్ సీపాన రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇది వరకెప్పుడో మెగా ఫోన్ పట్టాడు. తన దర్శకత్వంలో ఓ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ ఇప్పటి వరకూ విడుదల కాలేదు. అంటే ఓ రకంగా దర్శకుడిగా శ్రీధర్ ఫెయిల్ అనిచెప్పాలి. ఇప్పుడు తన చేతిలో మెగా అల్లుడిని పెట్టడమేంటి? గీతా ఆర్ట్స్ తలచుకుంటే, మంచి దర్శకులే తగులుతారు. లేదంటే యువరక్తం చేతిలో సినిమాని పెట్టేయవచ్చు. కానీ పోయి పోయి శ్రీధర్ ని ఎంచుకున్నారు. శ్రీధర్ అంత అద్భుతమైన కథ చెబితే ఓకే. లేదంటే… ఈ సినిమాకీ క్రేజ్ ఉండకపోవొచ్చు. అల్లుడి సినిమాలపై చిరుకి ఇంత అశ్రద్ధ దేనికో మరి.