‘సోగ్గాడే చిన్నినాయన’లో బంగార్రాజుగా నాగార్జున పండించిన వినోదం ఎప్పటికీ మర్చిపోలేం. సోగ్గాడే.. నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆ సినిమా పూర్తయిన వెంటనే ‘బంగార్రాజు’ పట్టాలెక్కిస్తారని ప్రచారం జరిగింది. నాగ్, కల్యాణ్ కృష్ణ ఇద్దరూ ఇదే మాట చెప్పారు. అయితే.. ఆ ప్రాజెక్టు అంతకంతకూ లేటవుతూ వస్తోంది. ఈలోగా కల్యాణ్ కృష్ణ రెండు సినిమాల్ని కూడా పూర్తి చేసేశాడు. నాగ్ ఇప్పుడు తన సినిమాలతో తాను బిజీగా ఉన్నాడు. మరి బంగార్రాజు మాటేంటి? ఈ సినిమా ఎందుకు ఆలస్యం అవుతోంది..? వీటిపై కల్యాణ్ కృష్ణ స్పందించాడు. “బంగార్రాజు ఆలస్యం అవ్వడానికి కారణం నేనే. స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. నేనెప్పుడు రెడీ చేస్తే అప్పుడు.. ఈ సినిమా పట్టాలెక్కుతుంది. నేల టికెట్టు విడుదలయ్యాక నా పూర్తి దృష్టి ‘బంగార్రాజు’ స్క్రిప్టుపై పెడతా“ అంటున్నాడు కల్యాణ్ కృష్ణ. నిజానికి ఈ సినిమా చేయాలని నాగ్ కూడా బాగా ఉత్సాహం చూపిస్తున్నాడు. కాకపోతే… స్క్రిప్టు ఇంకా ‘లైన్’ స్టేజీలోనే ఉంది. బంగార్రాజు ఎలా ఉంటాడు? ఏం చేస్తాడు? అతని క్యారెక్టరైజేషన్ ఏమిటి? అనే వరకే కల్యాణ్ కృష్ణ ఆలోచించాడు. దాని చుట్టూ కథ ఇంకా అల్లలేదు. అందుకే.. బంగార్రాజు ముందుకు సాగడం లేదు.