క్లాస్ పాటలతో ఆకట్టుకొనే సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్. ఆయన ఆల్బమ్ నిండా మెలోడీలే మెరుస్తాయ్. ఆయన కెరీర్లో మంచి పాటలెన్నో ఉన్నాయి. కానీ సరైన బ్రేకే రాలేదు. ప్రస్తుతం `ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి` చిత్రానికి పాటలు అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలొచ్చాయి. రెండూ హిట్టే. కల్యాణీ మాలిక్ సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలెట్టి 20 ఏళ్లయ్యింది. రెండు దశాబ్దాల కాలంలో ఆయన చేసినవి 19 సినిమాలే. వీటిలో ఐతే, అష్టాచమ్మా, ఊహలు గుసగుసలాడే, జో అత్యుతానంద లాంటి మంచి సినిమాలున్నాయి. ఇవన్నీ మ్యూజికల్ హిట్సే. అయితే కల్యాణీ మాలిక్‌కి ఇప్పటి వరకూ ఒక్క అవార్డు కూడా రాలేదు. అందుకనేనేమో.. ఆయన అవార్డుల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
”ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయిలో కనుల చాటు మేఘమా పాటకు చాలా మంచి పేరొచ్చింది. ఈ పాటకు జాతీయ అవార్డు వస్తుందని పాట విడుదల సమయంలో గట్టిగా నమ్మకాన్ని వ్యక్తం చేశాను. కానీ జాతీయ అవార్డులు ఎవరికి ఇస్తారో, అవి ఎలా వస్తాయో ఈమధ్య ఓ స్నేహితుడు చెప్పాడు. దాంతో అవార్డులపై నమ్మకం పోయింది. నా కెరీర్లో ఇప్పటి వరకూ ఒక్క అవార్డు కూడా రాలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాలోని `ఏం సందేహం లేదు` పాటకు చాలా మంచి పేరొచ్చింది. ఈ పాటని నేనూ, సునీత కలిసిపాడాం. అయితే సునీతకు మాత్రం అవార్డు ఇచ్చారు. నాకు ఇవ్వలేదు. ఆమెకే ఎందుకు ఇచ్చారో, నాకెందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచీ అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశాను. నా సినిమా నచ్చి, నా పాట నచ్చి ఎవరైనా నిర్మాత ఫోన్ చేసి నాకు మరో అవకాశం ఇస్తే.. అదే పెద్ద అవార్డుగా భావిస్తా..” అన్నారు.