నందమూరి బాలకృష్ణ తరవాత… `ఎన్టీఆర్` సినిమాలో నటించిన నందమూరి వారసుడు… కల్యాణ్ రామ్ మాత్రమే. హరికృష్ణ పాత్ర కల్యాణ్‌రామ్‌కి దక్కింది. తండ్రి మరణించిన తరవాత… ఈ పాత్రలో నటించడం కల్యాణ్‌రామ్‌కి సవాల్ గా మారింది. కానీ.. దాన్ని ధైర్యంగానే స్వీకరించాడు కల్యాణ్ రామ్. `ఎన్టీఆర్` ఆడియో వేదికపై కల్యాణ్ రామ్ ఇలా స్పందించాడు.
“తాతయ్య దగ్గర నుంచి కమిట్మెంట్ నేర్చుకున్నా. అంకితభావంతో చేయడం నేర్చుకున్నా. ఓ సామాన్య వ్యక్తిని ఇండియన్ సూపర్ స్టార్‌ని చేసిన తెలుగు ప్రేక్షకులకు ఏదో చేయాలని ఆయన అనుకుంటూ ఉండేవారు.
వాళ్ల రుణం తీర్చుకోవాలనుకుని చాలా మహోత్తరమైన కార్యక్రమాలు చేశారు. ఆయన జీవిత చరిత్ర చేయడం మామూలు విషయం కాదు. ఆ పాత్రలో నటించడం బాబాయ్ ఒక్కరి వల్లే అవుతుంది. ఈ సినిమా మొదలయ్యాక బాబాయ్ నాకు ఫోన్ చేశారు. మీ నాన్నగారి పాత్ర చేయాలి..? ఆలోచిస్తావా? అని అడిగారు. ఆలోచించడం ఏమిటి? ఇంత అద్భుతమైన వకాశం ఎవరైనా వదులుకుంటారా? ఇలాంటి సినిమాలో చిన్న ఫొటో వచ్చినా చాలు అనుకుంటారు. 30 సంవత్సరాల క్రితం.. బాబాయ్ సంస్థలోనే నట జీవితాన్ని మొదలెట్టా. మళ్లీ ఆయన బ్యానర్లో సినిమా చేయడం అంటే ఆలోచిస్తామా? బాబాయ్ మూలంగానే ఈ పరిశ్రమలో ఉన్నా. అందుకే ఏమాత్రం ఆలోచించలేదు. ఏరోజూ నేను మా నాన్నగారిలా ఉంటానని అనుకోలేదు. నాన్న మంచి దిట్టంగా, టైగర్‌లా ఉంటారు. నేనేమో బక్కగా ఉంటా. అందుకే చాలా గెటప్పులు ప్రయత్నించా. నాకు చాలా డౌట్లు ఉండేవి. ఓరోజు క్రిష్ గారు ఫొటో షూట్ చేశారు. కానీ నా అనుమానాలు పోలేదు. కానీ బాబాయ్ ఫోన్ చేసి `అచ్చం మా అన్నని చూస్తున్నట్టుంది` అని నాతో అన్నారు. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. తొలిసారి లొకేషన్‌కి వెళ్లినప్పుడు.. ప్రతీ డైలాగూ.. ఆయన చెప్పి, నాతో చెప్పించేవారు. ఈ సినిమాలు నాలుగు స్థంభాలు. బాబాయ్ ఒ స్థంభం. క్రిష్ మరో స్థంభం. క్రిష్ గారు లేకపోయి ఉంటే, ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. సాంకేతిక వర్గం అంతా మూడో స్థంభంలా మారారు. నటీనటులు నాలుగో స్థంభంగా మారారు“ అని ఈ సినిమాతో తనకున్న అనుభవాల్ని పంచుకున్నాడు కల్యాణ్ రామ్.