నందమూరి కళ్యాణ్ రామ్, ఆయన తమ్ముడు తారక్ అలియాస్ నందమూరి తారక రామారావు… హరికృష్ణ కుమారులు, స్వర్గీయ ఎన్టీఆర్ మనవలు ఇద్దరూ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. మీడియా సమావేశాల్లో కూడా రాజకీయాలకు వీలైనంత దూరం మెయింటైన్ చేస్తున్నారు. కొంతకాలంలో మీడియా సమావేశాల్లో రాజకీయాల గురించి ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా ఆ అంశాల గురించి ఆలోచించడం లేదని చెప్తున్నాడు. ఈ రోజు ‘ఎం.ఎల్.ఏ’ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చిన కళ్యాణ్ రామ్ కూడా ఇంచుమించు అటువంటి సమాధానమే చెప్పాడు. ప్రస్తుతం సినిమాల గురించి తప్ప, రాజకీయాల గురించి ఆలోచించడం లేదన్నాడు. ట్రయిలర్లో ‘నేనింకా రాజకీయం చేయడం మొదలుపెట్టలేదు. మొదలుపెడితే మీరు చేయడానికి ఏం మిగలదు’ అని చెప్పిన డైలాగ్ కూడా పొలిటికల్ కెరీర్ కోసం కాదన్నాడు. “కథ డిమాండ్ మేరకు సినిమాలో పొలిటికల్ డైలాగులు వుంటాయి. అంతే తప్ప కావాలని ఏం పెట్టలేదు. ప్రస్తుతం సినిమాల గురించి తప్ప, రాజకీయాలకు సంబంధించిన ఆలోచనలు లేవు. నేను రెండు పడవల మీద ప్రయాణం చేయలేను” అని కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. తమ్ముడితో కూడా సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ పెద్దగా రావని, ఎక్కువగా సినిమాల గురించే మాట్లాడుకుంటామని చెప్పాడు. అన్నదమ్ములు ఇద్దరూ ఎలాంటి రాజకీయ చర్చల్లోకి తమ పేర్లు రావడానికి ఇష్టపడటం లేదని అర్థమవుతుంది.