నందమూరి కల్యాణ్‌రామ్ కెరీర్ స్టార్టింగు నుంచి ఆల్మోస్ట్ ఒక్కటే తరహా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. పక్కా కమర్షియల్ మాస్ మసాలా సినిమాలు చేశాడు. అతనికి విజయాలు అందించిన ‘అతనొక్కడే’, ‘లక్ష్మీ కళ్యాణం’, ‘పటాస్’ సినిమాలు చూస్తే ఆ మాట నొక్కి మరీ చెప్పవచ్చు. అటువంటి కల్యాణ్‌రామ్ రూట్ మార్చాడు. ‘నా నువ్వే’ అంటూ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ చేశాడు. సిద్ధార్థ్ హీరోగా ‘180’ చేసిన జయేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. “జయేంద్రగారు నాకు కథ చెబుతారని చిత్ర సమర్పకుడు మహేష్ కోనేరు చెప్పగా నమ్మలేదు. ఆయన వచ్చి కథ చెప్పారు. నచ్చింది. కానీ, నన్ను ఎందుకు హీరోగా తీసుకోవాలనుకుంటున్నారో తెలీదు. ఆయన్నే అడిగా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే నేను ఈ కథకు కరెక్ట్ అన్నారు. నన్ను కొత్తగా చూపించడం వాళ్లకు పెద్ద టాస్క్ అనీ, అందులో విజయం సాధిస్తే సినిమా హిట్టవుతుందనీ అన్నారు. నేను ఎన్ని టేకులు తీసుకున్నా ఏం అనలేదు. నాతో కొత్తగా చేయించుకున్నారు” అని కల్యాణ్‌రామ్ ఆడియో వేడుకలో చెప్పారు.
కమర్షియల్ సినిమాలు చేయడం సులభమని చెప్పిన కల్యాణ్‌రామ్.. రొమాంటిక్ మూవీస్ చేయడానికి కో యాక్టర్ (హీరోయిన్)తో కెమిస్ట్రీ ముఖ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “రొమాన్స్, కెమిస్ట్రీ అంటే ముద్దులు పెట్టేసుకోవడాలు, గట్రా చేయడం కాదు. ఇంకేదో వుంటుంది. సంథింగ్ ఎల్స్. సినిమాలో అదే చూపించాం” అని కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు. ఫస్ట్ డే షూటింగులో రొమాంటిక్ సాంగ్ ‘చిలికి చిలికి వాన’ చేశారట. తమన్నా ఎంతో హెల్ప్ చేయడంతో ఈజీగా నటించానని కల్యాణ్‌రామ్ అన్నారు. ప్రతి రోజూ షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు రెండేసి గంటలు ప్రాక్టీస్ చేశామని తెలిపారు. ఇప్పటివరకూ చేసిన హీరోయిన్లలో తమన్నా ‘ది బెస్ట్’ అని కల్యాణ్‌రామ్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.