‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఆయన మనవడు ‘ఎన్టీఆర్’ కూడా ఉంటే బాగుంటుందన్నది నందమూరి అభిమానుల ఆశ. ఈ బయోపిక్ మొదలెడుతున్నప్పుడు అందరి చర్చా దాని గురించే. అయితే ఎన్టీఆర్ లేకుండానే బయోపిక్ పూర్తయిపోయింది. అయితే ‘ఎన్టీఆర్’ ఆడియో ఫంక్షన్‌కి జూనియర్ రావడం.. ఆ లోటుని కాస్త వరకూ తీర్చగలిగింది. ‘ఆడియో ఫంక్షన్ తమ్ముడి చేతుల మీదుగా జరిగింది. తారక్‌కి బాబాయ్ ఇచ్చిన గౌరవం అది. అంతకంటే కావల్సింది ఏముంది? ఉన్నాడు కదా అని ఏదో పాత్ర ఇవ్వలేం కదా, అసలు బాబాయ్ బాలకృష్ణ పాత్రే బయోపిక్‌లో లేదు’ అంటూ… కల్యాణ్ రామ్ ఈ పరిస్థితిని కాస్త స్థిమితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ మాటల్లోనూ నిజం ఉంది. నిజంగా ఎన్టీఆర్‌ని ఇరికించి, ఓ చిన్న పాత్ర అప్పగిస్తే… `చిన్న పాత్ర ఇచ్చి చేతులు దులుపుకున్నారు` అనేవారు.
కాకపోతే.. `ఈ బయోపిక్‌లో చిన్న ఫొటో లో అయినా కనిపించినా చాలు` అంటూ కల్యాణ్ రామ్ పదే పదే చెబుతున్నాడు కదా..? ఆ అవకాశం తన తమ్ముడికి దక్కకుండా పోయింది కదా? ఎన్టీఆర్ యుక్త వయసు పాత్రని జూనియర్ తో చేయిస్తే బాగుంటుందన్నది అందరి అభిప్రాయం. ఈ ఆలోచన బాలకృష్ణకు రాకుండా పోయింది. నిజంగా బాలయ్య కూడా అలా ఆలోచిస్తే.. నిజంగానే జూనియర్‌కి ఈ బయోపిక్‌లో మంచి స్థానమే దక్కేది. ఎన్టీఆర్ కూడా `బాబాయ్ పిలిస్తే తప్పకుండా చేస్తా` అని చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ.. బాలయ్య చెవికి ఆ మాటలు సోకలేదు. ఆడియో ఫంక్షన్ కి ఎన్టీఆర్ రావడం.. తను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఒక్కటే తారక్ అభిమానుల్ని ఊరడించే విషయం.