రామ్చరణ్ – ఎన్టీఆర్లు కలసి ఓ సినిమా చేస్తున్నారిప్పుడు. మల్టీస్టారర్ సినిమాలకు ఈ కాంబో ఎనలేని ఉత్సాహాన్ని అందించింది. నిజానికి మెగా – నందమూరి కాంబినేషన్ ఎప్పుడో సెట్టవ్వాల్సింది. కల్యాణ్ రామ్ – సాయిధరమ్ తేజ్ కలసి ఓ సినిమాలో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే కథ సెట్ కాకపోవడంతో దాన్ని పక్కన పెట్టేశారు. అయితే… కల్యాణ్ రామ్ నుంచి త్వరలోనే ఓ మల్టీస్టారర్ రాబోతోంది. పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దర్శకుడు ఎవరు? తనతో పాటు నటించే మరో కథానాయకుడు ఎవరు? అనే విషయాలపై కల్యాణ్ రామ్ క్లారిటీ ఇవ్వలేదు గానీ.. ”త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమా ప్రకటిస్తా” అని మాత్రం చెప్పాడు.
”హీరో ఎవరైనా సరే, కలసి నటించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సాయిధరమ్ తో ఓ సినిమా చేయాల్సింది. మేమిద్దరం చాలా ఉత్సాహపడ్డాం. కానీ… కథ మా ఇద్దరికీ నచ్చలేదు. అందుకే కాదనుకున్నాం. జూన్లో ఓ మల్టీస్టారర్ మొదలవుతుంది. దర్శకుడు, హీరో పేర్లు త్వరలోనే చెబుతా” అన్నాడు కల్యాణ్ రామ్. మరి ఈ నందమూరి హీరోతో కలసి నటించే మరో హీరో ఎవరన్నది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.