నందమూరి అభిమానులంతా పండగ చేసుకునే వార్త ఇది. బాలకృష్ణ, ఎన్టీఆర్.. ఇద్దరూ ఒకే వేదికపై కనిపించనున్నారు. `అరవింద సమేత వీర రాఘవ` సక్సెస్ మీట్‌కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఆదివారం సాయింత్రం శిల్పారామంలో `అరవింద సమేత` విజయోత్సవం జరగబోతోంది. బాలయ్య – ఎన్టీఆర్ – కల్యాణ్‌రామ్ ఒకే వేదికపై కనిపించడం.. ఓ అరుదైన, అందమైన జ్ఞాపకమే. నిజానికి `అరవింద`విడుదలకు ముందే ఈ కాంబినేషన్ చూస్తామనుకున్నారంతా. కానీ కుదర్లేదు. ఇప్పుడు ఆ కల తీరబోతోంది.
బాలయ్య ఈ ఫంక్షన్‌కి రావడం వెనుక.. కల్యాణ్ రామ్ మధ్యవర్తిత్వం బాగా పనిచేసిందని నందమూరి కాంపౌండ్ వర్గాలే చెబుతున్నాయి. `బాబాయ్ ఈ ఫంక్షన్‌కి మీరే రావాల్సిందే` అంటూ కల్యాణ్ రామ్ బాగా పట్టుపట్టాడట. బాలయ్య ఇప్పుడు కల్యాణ్ రామ్ మాట కాదనలేడు. ఎందుకంటే `ఎన్టీఆర్`లో కల్యాణ్‌రామ్ హరికృష్ణలా నటించడానికి ఒప్పుకున్నాడు. దానికి తోడు.. హరికృష్ణ మరణంతో కల్యాణ్‌రామ్,ఎన్టీఆర్ కుంగిపోయారు. వాళ్లకు అండగా ఉన్నా.. అన్న సంకేతం బాలయ్య మాత్రమే ఇవ్వగలడు. దానికి ఇంతకు మించిన తరుణం ఉండదు. బాలకృష్ణ – ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్కి… ఈ సక్సెస్ మీట్ తెరదించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీరిద్దరినీ ఒకే వేదికపై చూడ్డానికి అభిమానులు ఎనిమిదేళ్ల పాటు ఎదురుచూడాల్సివచ్చింది. `సింహా` సక్సెస్ మీట్లో బాబాయ్ కోసం.. ఎన్టీఆర్ వచ్చాడు. ఎనిమిదేళ్ల తరవాత ఎన్టీఆర్ కోసం బాలయ్య వస్తున్నాడు. నందమూరి కుటుంబానికే కాదు, రాబోతున్న 2019 ఎన్నికలకూ ఈ కలయిక కీలకం కానుంది.