వేసవిలో నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్. సమ్మర్ స్టార్టింగులో పక్కా కమర్షియల్ ప్యాకేజ్ ఫిల్మ్ ‘ఎమ్మెల్యే’తో థియేటర్లలోకి రావడానికి ముస్తాబవుతోన్న ఈ నందమూరి హీరో కళ్యాణ్‌రామ్, సమ్మర్ ఎండింగులోకి పొయెటిక్ లవ్ స్టోరీ ‘నా నువ్వే’ను ముస్తాబు చేస్తున్నాడు. రెండూ మాంచి క్రేజీ ప్రాజెక్టులనే చెప్పుకోవాలి. కాజల్ అగర్వాల్ కథానాయికగా, నందమూరి హీరోకి జోడీగా నటిస్తున్న ‘ఎమ్మెల్యే’లో వినోదం ఎలా ఉండబోతుందో టీజర్లో శాంపిల్ చూపించారు. దీనికి తోడు కాజల్ ఉండడంతో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. ఈ సినిమాను మార్చి 23న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తే.. ‘నా నువ్వే’తో క్లాస్ ప్రేక్షకులపై గురి పెట్టాడు కళ్యాణ్ రామ్. మే 23న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రసమర్పకుడు మహేష్ కోనేరు ట్వీట్ చేశాడు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఆ సినిమాకి ‘180’ ఫేమ్ జయేంద్ర దర్శకుడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. గతేడాది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ, నిర్మాతగా ‘జై లవకుశ’తో హిట్ కొట్టాడు. ఈ ఏడాది హీరోగా రెండు సినిమాలతో వస్తున్నాడు.