మాస్, కమర్షియల్ కథలపై దృష్టి సారించే కల్యాణ్ రామ్ ఈమధ్య రూటు మార్చాడు. `118`తో ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. అది మంచి ఫలితం ఇచ్చింది. `తుగ్లక్`తో మళ్లీ కమర్షియల్ బాట పట్టాడు. మల్లిడి వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాస్ మసాలా అంశాలు ఎక్కువ ఉండబోతున్నాయి. అందుకే కల్యాణ్ రామ్ మళ్లీ రూటు మార్చారు. తన తదుపరి చిత్రం.. కుటుంబ కథా నేపథ్యంలో ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఓ కథని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ కథని సతీష్ వేగ్నశ సిద్ధం చేశారని తెలుస్తోంది. రచయితగా పేరు తెచ్చుకున్న సతీష్ వేగ్నేశ శతమానం భవతితో దర్శకుడిగానూ రాణించారు. అందులో కుటుంబ బంధాల్ని ఆవిష్కరించిన తీరు అందరికీ నచ్చింది. ఈసారి కూడా ఆయన ఫ్యామిలీ డ్రామానే చూపించబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తుగ్లక్ పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. విరించి వర్మతో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. మరి ఆ కాంబో ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.