కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఇందులో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఓటీటీ డీల్స్ కూడా ఓ కొలిక్కి వచ్చాయి. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. ముందు ‘మెరుపు’ అనుకొన్నారు. ఆ తరవాత ‘రుద్ర’ అనే టైటిల్ బయటకు వచ్చింది. అయితే ఈ రెండూ కాకుండా ఇప్పుడు కొత్త పేరు పెట్టే ఆలోచనలో ఉంది చిత్రబృందం. పవర్ ఫుల్ టైటిల్ కోసం చిత్రబృందం అన్వేషణలో ఉందని, అది రాగానే.. టైటిల్ గ్లిమ్స్ తో పాటుగా టీజర్‌ని కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది.
ఇటీవల కల్యాణ్ రామ్ రషెష్ చూసుకొన్నారని, సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. అతనొక్కడే, పటాస్, బింబిసార తరవాత కల్యాణ్ రామ్ కెరీర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందని టీమ్ కూడా నమ్మకంగా ఉంది. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై నమ్మకం పెట్టుకొన్నారు. ‘కల్యాణ్ రామ్ కెరీర్లో అతనొక్కడే లాంటి సినిమా లోడింగ్’ అంటూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకొంటున్నారు. విజయశాంతి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వచ్చిందట. ఆ క్యారెక్టర్ ఈ సినిమాకు ఓ ప్రధాన ఆకర్షణ అవ్వబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ‘బింబిసార 2’ కథని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు కల్యాణ్ రామ్. ‘బింబిసార’ పెద్ద హిట్ అవ్వడంతో సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. ‘బింబిసార’ సెట్స్‌పైకి వెళ్లకుండానే ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయని, బడ్జెట్ పరంగానూ లెక్కలు మారాయని తెలుస్తోంది.