హరికృష్ణ హఠాన్మరణంతో `అరవింద సమేత వీర రాఘవ` షూటింగ్‌కి బ్రేక్ పడింది. అప్పటికి సినిమా షూటింగ్ మరో 30 రోజులు ఉంది. విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబరు 11న ఈ సినిమా వస్తుందా? రాదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తండ్రి మరణించిన 5వ రోజునే `అరవింద సమేత` షూటింగ్లో అడుగుపెట్టాడు ఎన్టీఆర్. దాంతో చిత్రసీమతో పాటు నందమూరి అభిమానులు కూడా నివ్వెరపోయారు. ఇంత విషాదాన్ని దిగమింగుకుని షూటింగ్‌కి ఎలా వెళ్లాడా? అని ఆశ్చర్యపోయారు. దానికి సమాధానం కల్యాణ్ రామ్ మాటల్లో దొరికేసింది.
ఈ వేడుకలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ‘‘ 1962వ సంవత్సరంలో తాతగారు నందమూరి తారక రామారావుగారు షూటింగ్లో ఉండగా ఆయన పెద్ద కొడుకు నందమూరి రామకృష్ణగారు కన్నుమూశారన్న దుర్వార్త వినాల్సివచ్చింది. కొడుకు చనిపోతే ఏ తండ్రీ తట్టుకోలేడు. కానీ, ఆయన లొకేషన్లో ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్‌కు నష్టం రాకూడదని, రోజంతా షూటింగ్ చేసి అప్పుడు వెళ్లారు. 1976లో మా ముత్తాత కూడా రోడ్డు ప్రమాదంలో కాలం చేశారు. అప్పుడు కూడా మా తాతగారు వృత్తికి ఇచ్చిన గౌరవంతో షూటింగ్ పూర్తి చేసే వెళ్లారు. 1982లో మా బాలయ్య బాబాయ్, రామకృష్ణ బాబాయ్‌ల పెళ్లిళ్లు వరుసగా జరిగాయి. మరో నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ప్రచారంలో ఉండి పెళ్లికి కూడా రాలేదు. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు కాబట్టి. దాన్ని వృత్తిగా అనుకున్నారు కనుకే రాలేదు. ఇటీవల మా ఇంట్లో విషాదం జరిగినప్పుడు ‘అరవింద సమేత’ 30రోజుల షూటింగ్ మిగిలే ఉంది. అసలు సినిమా ఇప్పుడప్పుడే రిలీజ్ అవుతుందా? అనుకున్నారు. కానీ, ప్రొడ్యూసర్ బాగుండాలి. మనం ఇచ్చిన మాట మీద నిలబడాలని ఐదో రోజే తమ్ముడు షూటింగ్‌కు వెళ్లాడు. నెల రోజుల పాటు రాత్రి పగలూ తమ్ముడు కష్టపడ్డాడు. అలా చేయడం వల్లే ఇప్పుడు అందరం ఈ ఆడియో ఫంక్షన్‌కు రాగలిగాం’’ అంటూ తమ్ముడి వృత్తి ధర్మం కోసం ప్రస్తావించాడు కల్యాణ్ రామ్. ఈ స్పీచ్‌తో చాలామంది ప్రశ్నలకు సమాధానాలు దొరికేసి ఉంటాయి.