డిక్టేటర్తో ఓ డీసెంట్ హిట్ కొట్టాడు శ్రీవాస్. ఆ తరవాత గోపీచంద్ కోసం ఓ కథ రెడీ చేయడం, గోపీ కూడా ఓకే అనేయడం జరిగిపోయాయి. అయితే ఎందుకనో ఆ సినిమా పట్టాలెక్కడం ఆలస్యమవుతోంది. ఓ వైపు గోపీ ఆక్సిజన్‌తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక శ్రీవాస్ తో జట్టు కడతాడనుకొంటే.. ఇటీవల సంపత్‌నంది కథకు ఓకేచెప్పాడు. ఆ తరవాత కూడా గోపీ కోసం దర్శకులు లైన్లో ఉన్నారు. శ్రీవాస్ వంతు వచ్చేటప్పటికి టైమ్ పట్టేట్టుంది. అందుకే… ఇప్పుడు శ్రీవాస్ తన మనసు మార్చుకొన్నట్టు సమాచారం.
గోపీచంద్ కోసం తయారు చేసుకొన్న ఈ కథని… కల్యాణ్‌రామ్‌కి వినిపించాడట శ్రీవాస్. ఆ కథ కల్యాణ్ రామ్‌కి బాగా నచ్చడంతో పచ్చజెండా ఊపేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో ఇజం సినిమాతో బిజీగా ఉన్నాడు కల్యాణ్‌రామ్. తాను ఖాళీ అవ్వడానికి మరో రెండు నెలలైనా సమయం పడుతుంది. ఆ తరవాతే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చు.