ఈరోజుల్లో హిట్ టాక్ రావడమే గగనం అయిపోయింది. యావరేజ్ అని ప్రేక్షకులు తీర్పు ఇచ్చినా… దాన్ని హిట్ చేసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆపసోపాలు పడిపోతుంటారు. సినిమాకి అలాంటిది హిట్ టాక్ వచ్చినా.. క్యాష్ చేసుకోకపోవడం చేతకాని తనమే. నాగశౌర్య – నందిని రెడ్డిల సినిమా కల్యాణ వైభోగమే.. ఈ లిస్టులో చేరుతుంది. జబర్దస్త్ లాంటి గట్టి దెబ్బ తిన్న తరవాత.. రెండేళ్లు విరామం తీసుకొని నందిని చేసిన ప్రయత్నం కల్యాణ వైభోగమే. గత వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లాస్ టచ్ ఉంది, ఫ్యామిలీ సినిమా అని తొలిషోకే అందరూ కితాబులు ఇచ్చారు. రేటింగ్స్ కూడా బాగానే అందాయి, కానీ ఓవరాల్ వసూళ్లు మాత్రం చిత్రబృందానికి సంతృప్తి కలిగించడం లేదు.
సాధారణంగా ఇంత పాజిటీవ్ టాక్ వచ్చిన ఏ సినిమా అయినా.. తొలి వారంలో కనీసం రూ.5 కోట్లయినా వసూళ్లు రాబట్టుకొంటుంది.కానీ కల్యాణ వైభోగమే మాత్రం రూ.3 కోట్ల దగ్గర ఆగిపోయింది. సినిమా హిట్టయిన తరవాత చిత్రబృందం కేవలం మౌత్ టాక్పైనే ఆధారపడడం, పబ్లిసిటీ పెంచే ఆలోచనలేం చేయకపోవడంతో.. వసూళ్లకు గండి పడింది. హిట్ అయిన తరవాత థియేటర్లు పెంచుకొంటే మంచి పలితం ఉండేది. కానీ.. ఆ దిశగా నిర్మాతలేం చొరవ చూపించలేదు. ఓవరాల్గా చూస్తే… కల్యాణ వైభోగమే సినిమాకి లాభాలు దక్కి ఉండొచ్చు. కానీ.. రావల్సిన క్రెడిట్ మాత్రం రాలేదు. ఇది మాత్రం నిరాశ పరిచే విషయమే.