కరోనా కొట్టిన దెబ్బ కారణంగా.. ఆదాయం కోసం టీటీడీ అధికారులు ఆన్ లైన్ బాట పడుతున్నారు. ఆర్జిత సేవల్ని ఆన్ లైన్లో పాల్గొనే విధంగా చేయబోతున్నారు. ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టిక్కెట్లను విడుదల చెయ్యనున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. అయితే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారందరూ.. నేరుగా తిరుమలకు రావాల్సిన పని లేదు. ఆన్లైన్లో కళ్యాణోత్సవ సేవలో పాల్గొనవచ్చు. ప్రతీ రోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభమవవుతుంది. మొదట పది నిముషాలు టిక్కెట్లు కొన్న భక్తులకు సంకల్పం చెప్పిస్తారు అర్చకులు. ఆ తర్వాత మిగతా పూజలు ప్రారంభిస్తారు.
ఆన్లైన్లో సేవలో పాల్గొంటున్నప్పటికీ.. భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలంటుని టీటీడీ నియమం పెట్టింది. వస్ర్తం, లడ్డు ప్రసాదం, అక్షింతలను పోస్ట్ ద్వారా పంపుతామని ప్రకటించింది. తిరుమల క్షేత్రానికి వెళ్లి కళ్యాణోత్సవ సేవ చేయించాలని కోరుకోని శ్రీవారి భక్తులు ఉండరు. కరోనాకు ముందు… కళ్యాణోత్సవానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ధనవంతులు లక్షలు పోసి బ్లాక్లో కొనేవారు. అయితే.. ప్రస్తుతం కరోనా కారణంగా మొత్తం నియంత్రించేశారు. టిక్కెట్లు తీసుకున్న భక్తులు కూడా రావడం తగ్గించారు. దీంతో టీటీడీకి ఆదాయం పడిపోయింది. ఈ కారణంగా ఇప్పుడు… ఆన్ లైన్ బాట ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు.
కళ్యాణోత్సవ సేవకు ఆన్ లైన్లో భక్తులు పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తే… మిగతా సేవలకూ… ఆ విధానాన్ని అనుసరించే అవకాశాన్ని టీటీడీ పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. అంతా ఆన్ లైన్ బాట పట్టిన సమయంలో.. టీటీడీ కూడా ఇలా పూర్తిగా ఆన్ లైన్ అయిపోతే బాగుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. తిరుమలకు వెళ్లకుండా… శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించకుండా.. ఆన్ లైన్లో కల్యాణోత్సవ పూజ చేస్తే.. ఆ సంతృప్తి భక్తులకు ఉంటుందా.. అనేది సమాధానం లేని ప్రశ్న..!