కల్యాణ్ రామ్ నటించిన కొత్త చిత్రం.. అమిగోస్. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ టైటిల్ ఏమిటి? ఇలా ఉంది..? అనుకొన్నారు. అమిగోస్ అంటే ఫ్రెంచ్ భాషలో స్నేహితులు అని అర్థం. ఆ తరవాత.. ఆ విషయం మెల్లమెల్లగా తెలిసింది. ఈ సినిమాకి పరభాషా టైటిల్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా అర్థం కాకుండా ఎలా ఉంది? ఈ విషయంపై కల్యాణ్ రామ్ స్పందించారు.
”స్నేహితులు, ముగ్గురు స్నేహితులు.. అంటూ ఏదో ఓ రొటీన్ టైటిల్ పెట్టాలని మాకు అనిపించలేదు. స్నేహితులు అనే అర్థం వచ్చేలా పరభాషలో ఎలాంటి పదాలు ఉన్నాయో చూశాం. అప్పుడు అమిగోస్ తట్టింది. శేఖర్ కమ్ముల గారి బ్యానర్ పేరు కూడా ఇదే. అందుకే క్యాచీగా ఉంటుందని పెట్టాం. టైటిల్ విషయంలో తప్పు జరక్కూడదని నా గట్టి అభిప్రాయం. అమిగోస్ అంటే ముందు ఎవరికీ తెలియకపోవొచ్చు.కానీ ఆ తరవాత స్నేహితులని అర్థం చేసుకొన్నారు. కాంతార టైటిల్ పెట్టినప్పుడు కూడా అసలు ఆ పేరుకి మనకెవరికీ అర్థం తెలీదు. ఆ తరవాత.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని కాంతార అని అంటారని తెలిసింది. అమిగోస్ ని కూడా అలానే అర్థం చేసుకొన్నారు” అని ఈ టైటిల్ గురించి చెప్పుకొచ్చాడు కల్యాణ్ రామ్.