ఇజం తరవాత కల్యాణ్ రామ్ సినిమా ఏంటన్నది ఇంకా తేలలేదు. మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో కలసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తాడన్న ప్రచారం జరిగింది. అయితే… ఆ సినిమా ఎంతకీ ముందుకు కదలడం లేదు. దాంతో.. కొత్త కథలవైపు దృష్టి పెట్టాడు కల్యాణ్ రామ్. ఈ నందమూరి హీరో కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేసుకొన్నారని సమాచారం. పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి కల్యాణ్‌రామ్ ఉత్సాహం చూపిస్తున్నాడు. సుప్రీమ్ తరవాత అనిల్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. కాబట్టి అనిల్ ఆప్షన్ బెటర్‌గానే తోస్తోంది. అయితే ఇప్పుడు మరో ఇద్దరు దర్శకులు కూడా కల్యాణ్ రామ్ కోసం కథలు రెడీ చేశారని సమాచారం. శ్రీరస్తు శుభమస్తుతో ఓ హిట్ అందుకొన్న పరశురామ్ ఇప్పుడు కల్యాణ్ రామ్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడట. త్వరలోనే కల్యాణ్ రామ్‌ని కలసి కథ వినిపించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్థానం దర్శకుడు దేవాకట్టా కూడా కల్యాణ్ రామ్ కోసం ఓ కథ రాసుకొన్నాడట. ఈమధ్యే కల్యాణ్‌రామ్ ని కలసి లైన్ కూడా వినిపించాడని టాక్. ‘ఇజం’ ప్రమోషన్లు, వసూళ్ల లెక్కల హడావుడిలో ఉన్న కల్యాణ్ రామ్ ఇప్పటి వరకూ తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో ఓ క్లారిటీకి రాలేదని, ఎవరి కథ నచ్చితే వాళ్లతో ప్రొసీడ్ అయ్యే అవకాశాలున్నాయని, అయితే వీరిలో అందరికంటే ఎక్కువ అవకాశాలు అనిల్ రావిపూడికే ఉన్నాయని తెలుస్తోంది.