నందమూరి కల్యాణ్‌రామ్ కోసం మరో స్క్రిప్ట్ రెడీగా వుంది. సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన హీరోగా నటించిన ‘118’ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అది విడుదలైన వెంటనే కొత్త సినిమాను పట్టాలు ఎక్కించడానికి దర్శకుడు విరించి వర్మకు కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజానికి, గతేడాది మార్చిలో ఉగాది పర్వదినాన విరించి వర్మ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు కల్యాణ్ రామ్. 2018 ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నారు. కానీ, కుదరలేదు. మధ్యలో ‘118’ మొదలైంది. విడుదలకు సిద్ధమైంది. ఈలోపు విరించి వర్మ పక్కాగా పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేయడంతో ఆలస్యం చేయకుండా షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇందులో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ప్రస్తుతం కల్యాణ్ రామ్ నుంచి వస్తున్న ‘118’ థ్రిల్లర్ అయితే.. విరించి వర్మ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్. గతేడాది ఉగాదికి ప్రకటించిన సినిమా… ఈ ఏడాది ఉగాదికి కొన్ని రోజుల ముందు సెట్స్ మీదకు వెళ్తుండటం విశేషమే. విరించి వర్మతో కల్యాణ్ రామ్ సినిమా ఉంటుందో? లేదో? అని సందేహాలు వ్యక్తమయ్యాయి. అటువంటి సందేహాలు అవసరం లేదు. సినిమా పక్కాగా ఉంటుంది.