బింబిసారతో ఓ మంచి హిట్టు కొట్టాడు కల్యాణ్ రామ్. ఆ తరవాత వచ్చిన అమిగోస్, డెవిల్ చిత్రాలు నిరాశ పరిచాయి. ఇప్పుడు అతన్నుంచి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ సినిమా వస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషించిన సినిమా ఇది. ప్రదీప్ దర్శకుడు. టీజర్ ఇటీవలే విడుదలైంది. దానికి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా పూర్తయ్యింది. మేలో విడుదల చేద్దామన్నది ప్లాన్. అయితే ఇప్పుడు కల్యాణ్ రామ్ కాస్త తొందర పడుతున్నాడు. ఏప్రిల్ 18న ఈ సినిమాని విడుదల చేద్దామని డిసైడ్ అయ్యాడట. అంటే… మరో 15 రోజుల సమయం వుంది. అంతే. ఈ పదిహేను రోజుల్లో కావాల్సినంత ప్రమోషన్ చేసుకోగలరా, సినిమాని జనంలోకి తీసుకెళ్లగలరా? అనేది పెద్ద డౌట్. ఈమధ్య ప్రమోషన్లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు నిర్మాతలు. కనీసం నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలెడుతున్నారు. అలాంటప్పుడు 15 రోజుల గ్యాప్ చాలా తక్కువ.
ఇటీవలే ట్రైలర్ కట్ కూడా చేశారు. ట్రైలర్ చూసినవాళ్లంతా సంతృప్తి వ్యక్తం చేశారు. కచ్చితంగా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ఆకర్షణ ఈ ట్రైలర్ లో ఉందని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. ఈ రెండు వారాల్లో గట్టిగా ప్రమోషన్ చేసుకొంటే, ఓపెనింగ్స్ కి కొరత ఉండదన్నద ధీమా వ్యక్తం అవుతోంది. మరోవైపు కల్యాణ్ రామ్ ఆల్రెడీ ప్రమోషన్లు మొదలెట్టేశాడు. ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఓ పాట విడుదలైంది. మిగిలినవన్నీ వరుస కట్టబోతున్నాయి. ఇక విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి.