కరోనా విపత్తు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి చూస్తున్నాం కదా. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాల సంఖ్య తక్కువే అయినా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ ఇతర రోగులకు అది ఇబ్బందికరం, ప్రమాదకరం. దీంతో ప్రభుత్వాలు కొన్ని ఆసుపత్రులను ప్రత్యేకంగా కరోనా ఆసుపత్రులుగా మార్చేస్తున్నాయి. ఈ పరిస్థితి పలు రాష్ట్రాల్లో కనబడుతోంది. హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చేసింది ప్రభుత్వం. ఇలా చాలా రాష్ట్రాల్లో జరుగుతోంది. అయితే దేశంలో పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్యను చూస్తుంటే ఈ ఆస్పత్రులు సరిపోవేమోననే అనుమానం కలుగుతోంది. కరోనా వైరస్ మొదలైన తొలినాళ్లలోనే చైనా కేవలం పది రోజుల్లోనే వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించి రికార్డు సృష్టించింది. మన దేశంలో అలా చేయడం సాధ్యం కాదు. కానీ ఉన్న ఆస్పత్రులనే కరోనా ఆసుపత్రులుగా మార్చవచ్చు. అలా ఎన్నింటిని మారుస్తారు? ఇతర రోగాలతో బాధపడేవారికి కూడా వైద్యం చేయాలి కదా. ప్రాణాపాయంలో ఉన్న వారికి ఆపరేషన్లు చేయాలి కదా. ఓ పక్క కరోనా రోగులకు చికిత్స చేయాలి. మరోపక్క ఇతర రోగాలు వచ్చినవారికి వైద్యం అందించాలి. నిజంగా ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. దీన్ని తమిళ సూపర్ స్టార్లలో ఒకడైన కమల హాసన్, మరో నటుడు పార్తీబన్ గమనించారేమో. వారిద్దరూ ప్రభుత్వం అవసరమైతే తమ ఇళ్లను కరోనా ఆసుపత్రులుగా మార్చుకోవచ్చని, అందుకు తమకు అభ్యంతరం లేదని మీడియా ముఖంగా ప్రకటించారు. ఇది వారి ఔదార్యానికి నిదర్శనం. అన్ని భాషల నటీ నటులు, టెక్నీషియన్లు తమ శక్తి కొద్దీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా విరాళాలు ఇవ్వడం మామూలే. కానీ తమ ఇళ్లనే ఆసుపత్రులుగా మార్చుకోవాలని చెప్పేవారు ఎవరుంటారు? ఇది నిజంగా గ్రేట్ కదా.