కమల్‌హాసన్ రాకతో… ప్రాజెక్ట్ కెలో స్థాయి మరింత పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయనకు కమల్ తోడయ్యారు. ఈ పరంపర ఇక్కడితో ఆగడం లేదు. మరింత మంది స్టార్లు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకోబోతున్నారు. ఈ సినిమాని ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా చేయాలన్నది నాగ అశ్విన్ తాపత్రయం. వెనుక అశ్వనీదత్ ఎలాగూ ఉన్నారు. కాబట్టి.. ఆ కల నెరవేరడం పెద్ద కష్టమేం కాదు.
ఈ సినిమాలో కమల్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఆ విలనిజం అత్యంత భయంకరంగా ఉంటుందని టాక్. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలన్న కోరికతో రగిలే స్వార్థపరుడిగా కమల్ కనిపించనున్నారని టాక్. కలియుగం అంతానికి కల్కి జన్మిస్తాడని ఓ కథ ప్రచారంలో ఉంది. అసలు ఈ యుగం ఎలా అంతం అవుతుంది? ఎవరి వల్ల అంతం అవుతుంది? అనేది మరింత ఆసక్తిదాయకం. ఆ అంతానికి ఓ వ్యక్తి స్వార్ధం కారణమైతే ఎలా ఉంటుందో.. అలాంటి క్యారెక్టరైజేషన్ తో కమల్ పాత్రని డిజైన్ చేశారని టాక్. అభయ్ లాంటి చిత్రాల్లో కమల్ విలన్‌గా నటించాడు. అయితే అందులో పాజిటీవ్ రోల్ కూడా కమల్ దే కాబట్టి.. కమల్ కి ఎదురు లేకుండా పోయింది. ఇక్కడ అలా కాదు. తొలిసారిగా పూర్తి స్థాయి నెగిటీవ్ రోల్ పోషించబోతున్నాడు కమల్. ఇది నిజంగా తన కెరీర్లోనే పెద్ద సవాల్. దేశం గర్వించదగిన నటుడిగా ప్రసంశలు అందుకొన్న కమల్ కి.. ప్రాజెక్ట్ కె లోని పాత్ర ఓ పరీక్షగా నిలవబోతోంది. మరి.. ఈసారి కమల్ ఏ స్థాయిలో విజృంభిస్తాడో చూడాలి.
అన్నట్టు ఈ సినిమా టైటిల్‌ని అతి త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటి వరకూ ప్రాజెక్ట్ కె అనేది వర్కింగ్ టైటిల్ గా చలామణిలో ఉంది. ఇందులో కె అంటే కల్కీ అని టాక్. అదే పేరు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.