ఆకలైన వాడికి అన్నం పెట్టడం కాదు… అన్నం సంపాదించుకునేలా చేయడం.. నాయకుడి లక్షణం. కడుపు నింపితే ఆ ఒక్క పూటకే.. అదే తనకు తాను సంపాదించుకోవడం నేర్పితే.. అది జీవితాంతం ఉపయోగపడుతుంది. అసలు చేయాల్సింది ఇదే. కానీ రాజకీయ పార్టీనేతలు… ఓటర్లు తమపై ఆధారపడి ఉంటేనే తమకు ఓట్లు వేస్తారన్న ఉద్దేశంతో వారికి ఉచిత పథకాలు ఇచ్చి మరీ బిచ్చగాళ్లుగా.. సోమరిపోతులుగా మార్చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మార్చాలని చాలా మంది చెబుతూ వస్తూంటారు. కానీ… ఒక్కరంటే ఒక్కరు కూడా ముందడుగు వేయరు. తొలి సారిగా.. అలాంటి రాజకీయ నేత తమిళనాడులో వెలుగులోకి వచ్చారు. ఉచిత హామీల రాష్ట్రంగా ప్రసిద్దికెక్కిన తమిళనాడులో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు.. తమ ఉచిత హామీలతో హోరెత్తించాయి. మిగతా పార్టీలు బరిలో నిలబడాలంటే అంత కంటే ఎక్కువ హామీలు ఇవ్వాలి. కానీ.. అనూహ్యంగా మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రూటు మార్చారు. తనది భిన్నమైన రాజకీయ పార్టీ అని తెలిసేలా మెనిఫెస్టో విడుదల చేశారు.
కమల్ హాసన్ తన మేనిఫెస్టోలో ఉచిత హామీలకు పెద్దగా చోటు కల్పించలేదు. పైగా.. తమిళనాడు ఆరు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. తాను ఇంకా ఉచిత హామీలు ఇచ్చి ప్రజల పై భారం మోపలేనని.. రాష్ట్రానికి అన్యాయం చేయలేనని చెప్పుకొచ్చారు. మరి ఆయనకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలకు డౌట్ వస్తుంది. అందుకే.. కమల్ హాసన్ .. తన విజన్ ను మేనిఫెస్టోలో ఆవిష్కరించారు. మహిళలు సహా అందరికీ ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ సొంత ఆదాయంతో జీవనం గడిపేలా … ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎవరైనా చదువు అయిపోయిన మూడేళ్ల తర్వాత కూడా ఉద్యోగం రాకపోతే విద్యారుణం మాఫీ చేస్తామన్నారు. ఇదొక్కటే… ఆయన ఇచ్చిన నగదు హామీ. దీనికి కూడా… చాలా స్పష్టమైన రీజన్ ఉంది.
అందరూ ఒకే దారిలో వెళ్తే… గుంపులో గోవిందయ్యలా ఉంటారు. భిన్నమైన మార్గంలో వెళ్తేనే చర్చలు జరుగుతాయి. ఇప్పుడు కమల్ పార్టీ మేనిఫెస్టోపై అలాంటి చర్చే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు.. ప్రభుత్వాధినేతలు తమ జేబుల్లో నుంచి డబ్బులు తీసి పథకాలకు పంచి పెట్టరు. ప్రజల నుంచే వసూలు చేస్తారు. అప్పులు చేసినా అదే పరిస్థితి. దీనిపై ప్రజల్లో అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అదే సమయంలో… మధ్య, ఉన్నత తరగతి వర్గాల వద్ద పన్నుల రూపంలో బాది ఓటు బ్యాంక్‌కు పెడుతున్నారన్న అసహనం కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కమల్ పార్టీ మేనిఫెస్టో …ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.