రాజ్ కమల్ ఇంటర్నేషనల్స్ సంస్థ పేరుతో కమల్ హాసన్ సొంతంగా సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. `విక్రమ్` చిత్రానికీ తనే నిర్మాత. ఈమధ్య తన సినిమాలన్నీ రాజ్ కమల్ సంస్థ లోనే తెరకెక్కుతున్నాయి. అయితే తొలిసారి మరో హీరోతో కమల్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.. సూర్య. `విక్రమ్`లో సూర్య అతిథి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే… సూర్యతో ఓ పూర్తి స్థాయి సినిమా చేయాలని కమల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట.
”సూర్యతో ఓ సినిమా చేయాలన్నది నా ప్లాన్. తన కోసం కథలు కూడా విన్నాను. కానీ సెట్ కాలేదు. అయితే త్వరలో తప్పకుండా సూర్యతో ఓ సినిమా నా సంస్థ నుంచి ఉంటుంది” అని కమల్ ప్రకటించాడు. ‘విక్రమ్‌లో’ సూర్య ఎంట్రీ గురించి చెబుతూ ”ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉంది. అది సూర్య అయితే బాగుంటందనిపించింది. సాధారణంగా ఇలాంటి ఆబ్లికేషన్స్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సివస్తుంది. హీరో ఇంటికి వెళ్లి, ఓ బొకే ఇచ్చి.. నాలుగు కబుర్లు చెప్పి, అప్పుడు `మా సినిమాలో నటిస్తారా` అని అడగాలి. నాకు అంత టైమ్ లేకుండా పోయింది. ఒక్క ఫోన్ చేశాను. అంతే.. సూర్య ఒప్పుకొన్నాడు. `మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడ వస్తా అన్నయ్యా` అన్నాడు. అంతే.. అంతకు మించి మాటలు కూడా లేవు.. తనకి కనీసం బొకే కూడా ఇవ్వలేదు..” అని చెప్పుకొచ్చారు కమల్ హాసన్.