ప్రముఖ సినీ నటుడు మరియు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే..
లోకనాయకుడు కమల్ హాసన్ కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. సినీ నటుడిగా అఖండ విజయాలు సాధించారు. ఆ తర్వాత మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించి 2019 లోక్సభ మరియు 2021 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టారు. అయితే లోక్సభ ఎన్నికలలో తాను ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. ఈసారి మాత్రం దక్షిణ కోయంబత్తూరు ప్రాంతం నుండి పోటీకి దిగారు. మొదటి రౌండ్ నుండి సాయంత్రం వరకు స్వల్ప ఆధిక్యతను కనబరుస్తూ వచ్చిన కమల్ హాసన్, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఫలితాలు వెలువడిన ప్రతి రౌండ్లోనూ సమీప ప్రత్యర్థి బిజెపి నేత వానతి శ్రీనివాసన్ కంటే వెనుకబడ్డారు.
నిజానికి కమల్ హాసన్ నియోజకవర్గాన్ని ఎంచుకునే విషయంలో కొంత చాణక్యత ప్రదర్శించారు. మొదట్లో చెన్నై పరిసర ప్రాంతంలోని నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని సంకేతాలు పంపారు కమల్ హాసన్. అయితే అధికారికంగా తన నియోజకవర్గాన్ని నిర్ధారణ చేయకుండా డీఎంకే మరియు అన్నాడీఎంకే జాబితా వచ్చేంతవరకు వేచి చూశారు. వారి జాబితాలు విడుదలైన తర్వాత వారి అభ్యర్థుల లిస్ట్ చూసి తన నియోజకవర్గానికి ఖరారు చేసుకున్నారు. దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గాన్ని అన్నాడిఎంకె కూటమి పొత్తులో భాగంగా బిజెపికి వదిలివేయగా, డి.ఎం.కె కూటమి అదే నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి వదిలివేసింది. దీంతో అటు డీఎంకే అభ్యర్థి కానీ ఇటు అన్నాడీఎంకే అభ్యర్థి కానీ లేనటువంటి దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గాన్ని తాను పోటీ చేయడానికి ఎంచుకున్నారు కమల్ హాసన్. తమిళనాట బిజెపి కాంగ్రెస్ పార్టీల సొంత బలం నామమాత్రం కావడంతో కమల్ హాసన్ దానిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించారు. అదీ కాకుండా దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం సామాజిక సమీకరణాల పరంగా కూడా తనకు కలిసి వస్తుందన్న అంచనా తో కమల్ హాసన్ అక్కడ నుండి పోటీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గం కొంతవరకు అర్బన్ నియోజకవర్గం. దీంతో విద్యావంతులైన ఓటర్లు తన వైపు మొగ్గు చూపుతారని కమల్ భావించారు.
మొత్తానికి తమిళనాడులోని చిన్న నియోజకవర్గాల్లో ఒకటైన దక్షిణ కోయంబత్తూరు లోనూ కమల్ హాసన్ ఎత్తులు ఫలించలేదు. అర్బన్ నియోజకవర్గం అయినప్పటికీ, సామాజిక సమీకరణలు అనుగుణంగా ఉంటాయని భావించినప్పటికీ, కమల్ హాసన్ 1000 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 33 శాతం ఓట్లను కమల్ హాసన్ సాధించగా, బీజేపీ నేత వానతి శ్రీనివాసన్ 34 శాతం ఓట్లతో విజేతగా నిలిచారు. కాంగ్రెస్ నేత జయకుమార్ 28 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కమల్ హాసన్ ఒక్కడే కొంతవరకు పోటీని ఇచ్చినప్పటికీ ఆ పార్టీ తరఫున మిగిలిన అభ్యర్థులు ఎవరూ ఈ మాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయారు.
కమల్ హాసన్ పార్టీ తోపాటు విజయకాంత్ పార్టీ కూడా ఈ సారి ఎన్నికల్లో ఎక్కడా పత్తా లేకుండా పోవడం గమనార్హం.