దేశవ్యాప్తంగా ముస్లింలను ఓటు బ్యాంక్‌గా మార్చుకునే ప్రయత్నంలో బిజీగా మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్.. తన తదుపరి అడుగు తమిళనాడులో పెట్టాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అసదుద్దీన్‌కు తమిళనాడు నుంచి బంపర్ ఆఫర్ కూడా వచ్చింది. ఓవైసీతో జట్టు కట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కమల్ హాసన్‌కు… విజయాలు దక్కలేదు కానీ.. కొంత ఓటు బ్యాంక్ ఏర్పడింది. దాంతో కమల్ హాసన్… అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు.
రజనీకాంత్ పార్టీ పెడితే.. ఆయనతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని చాలా సార్లు చెప్పారు. అయితే రజనీకాంత్.. తాను మాత్రమే పోటీ చేస్తానని ఎవరితో పొత్తులు పెట్టుకునే ప్రశ్నే లేదని ప్రకటించేశారు. దీంతో కమల్ హాసన్.. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. డీఎంకే కూటమిలో చేరే అంశంపై చర్చలు జరిపారో లేదోక్లారిటీ లేదు. బీజేపీ ఉన్న అన్నాడీఎంకే కూటమిలో చేరే అవకాశం లేదు. బీజేపీతో కమల్ హాసన్‌కు అసలు సరిపడదు.
దీంతో ఆయన ఓవైసీతో సరిపెట్టుకోవాలనుకుంటున్నారు. తమిళనాడులో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. అక్కడ కూడా ప్రత్యేకంగా ముస్లిం పార్టీలు ఉన్నాయి. అవి డీఎంకే కూటమిలో భాగంగా ఉన్నాయి. ఆ పార్టీ నేతలు ఒకటి, రెండు చోట్ల పోటీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ స్థానాలను.. ఎంఐఎం గురి పెట్టే అవకాశసం ఉంది. ఓవైసీ, కమల్ పొత్తు తమిళనాడు రాజకీయాల్లో ఓట్ల చీలిక పరంగా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.