నవంబరు 7న తన జన్మదినోత్సశం సందర్భంగా రాజకీయ పార్టీ స్థాపన ప్రకటిస్తానంటూ వస్తున్న కథనాలను కమల్‌హాసన్ తోసిపుచ్చారు. అలాటి విషయాలు ప్రజా వేదికలోనే చేస్తామని పుట్టిన రోజు వంటి వ్యక్తిగత సందర్భాలతో కాదని వివరణ ఇచ్చారు. ప్రతిఏటా తన పుట్టిన రోజున అభిమానులు సమీకృతం కావడం ఎప్పుడూ జరిగేదేనని కూడా తెలిపారు. అంతేగాక మీడియా ఒత్తిడి చేస్తే నేను పార్టీని ప్రకటించాలా అని ఎదురు ప్రశ్నవేయడం విశేషం! వాస్తవానికి అనందవికటన్ పత్రికలో ఎన్నల్ మయ్యాం కొందా పుయ్యాల్( నన్ను చుట్టుముట్టిన తుపాను)వారం వారం శీర్షికన రాస్తూ కమల్ హాసన్ స్వయంగా ఇలాటి సూచనలు చేశారు. ఆ రోజున అన్నీ చెబుతాను అని రాశారు. దాంతో పార్టీ స్థాపన ప్రకటిస్తారని వూహాగానాలుసాగాయి. ఇప్పుడు ఆయన స్వయంగా వాటిని కొట్టివేశారన్నమాట. కాకుంటే 18-35 ఏళ్ల మధ్య యువత గొప్ప శక్తిగా వున్నారని వారి ఆలోచనలు ఆరాటం చూస్తే గర్వంగా వుంటుందని కమల్ వ్యాఖ్యానించారు. అంటే ఆయన ఫ్రధానంగా యువతపై గురి పెడుతున్నారన్నది స్పష్టం. వామపక్ష అభిమానిగా చెప్పుకున్న కమల్ విప్లవం వల్ల ఉపయోగంలేదని మాత్రం అంటున్నారు. దోపిడీ పీడన గురించి చాలా చెప్పాం. కాని వాటిని అంతం చేయడానికి విప్లవం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అందులోనూ అనేకమంది ప్రాణాలు కోల్పోతారు అని వ్యాఖ్యానించారు. మొత్తంపైన కమల్ హాసన్రాజకీయాలలోకి రావాలని బలంగా కోరుకుంటున్నా ఇంకా స్పష్టతకు రాలేకపోతున్నట్టు కనిపిస్తుంది.