ఉత్తరాది – దక్షిణాది తరాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మనవాళ్లు… `బాలీవుడ్ వాళ్లు గొప్పవాళ్లు.. అన్నింటికంటే ముందుంటారు` అనే విషయాన్ని ఒప్పుకుంటారు. అక్కడి సినిమాల గురించి కితాబులు ఇస్తారు. అక్కడి సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని, భారీ పారితోషికాలు ఇచ్చి మరీ ఆహ్వానిస్తారు. కానీ.. బాలీవుడ్లో అలా ఉండదు. దక్షిణాది ప్రతిభని మెచ్చుకోవడానికి వాళ్లకెందుకో మనసొప్పదు. కానీ షారుఖ్ ఖాన్ మాత్రం దక్షిణాది నటుడి గొప్పదనాన్ని కొనియాడాడు. తామెన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ నటుడి స్థాయికి చేరుకోలేరని చెప్పుకొచ్చాడు. షారుఖ్ మనసు గెలుచుకున్న ఆ నటుడెవరో కాదు… మన కమల్ హాసన్.
షారుఖ్ నటించిన `జీరో` వచ్చేవారంలో విడుదల అవుతోంది. ఇందులో షారుఖ్ మరుగుజ్జు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. `విచిత్ర సోదరులు`లోనూ కమల్‌హాసన్ ఇలాంటి పాత్రే చేశాడు. మరి ‘జీరో’ పాత్రకోసం కమల్ నటించిన సినిమాని రిఫరెన్స్‌గా తీసుకున్నారా? అని అడిగితే.. ”ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేని రోజుల్లో కమల్ ఆ పాత్ర చేశారు. అందుకోసం ఆయన ఎంతగా కష్టపడి ఉంటారో ఓ నటుడిగా నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ పుణ్యమా అని.. ఆ కష్టాలేవీ నేను పడలేదు. అలాంటి పాత్ర చేయాలంటే కమల్ వల్లే సాధ్యం. ఆ తరహా ప్రయోగాలు చేసే ధైర్యం మాలో ఎవరికీ లేదు” అంటూ కమల్‌కి కితాబిచ్చాడు షారుఖ్. మిగిలిన హీరోల మాటేమో గానీ.. షారుఖ్‌కి ముందు నుంచీ దక్షిణాది చిత్రాలపై ఇక్కడి నటీనటులపై తగినంత అభిమానమే ఉంది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో రజనీ ని కీర్తిస్తూ ఓ పాట కూడా చేశాడు షారుఖ్. ఇప్పుడు మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు.