రజనీకాంత్ ఆరోగ్య కారణాలతో పొలిటికల్ ఇన్నింగ్స్‌కు మిడిల్ డ్రాప్ ప్రకటించినప్పటికీ.. మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ మాత్రం వెనక్కి తగ్గదల్చుకోలేదు. తాను ప్రారంభించిన పార్టీకి ప్రస్తుతం గొప్ప ఆదరణ లేదని లోక్‌సభ ఎన్నికల్లో తేలింది. అయితే కమల్ హాసన్ మాత్రం.. డోంట్ గివ్ అప్ అనుకుంటున్నారు. తన పార్టీ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్త చేస్తున్నారు. అసెంబ్లీలో తన గొంతుని బలంగా వినిపిస్తానని చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో మూడో అతిపెద్ద పార్టీగా మక్కల్ నీది మయ్యంని కమల్ చెబుతున్నారు.
అయితే.. తన బలంపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే… కూటమి కట్టాలనే ఆలోచనకు వచ్చారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నానని ప్రకటించారు. రజినీకాంత్ పార్టీ పెట్టినా, పెట్టకపోయినా మద్దతు కోరుతానని.. ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. డీఎంకేతో కూటమిలో చేరబోతున్నారని వస్తున్న వార్తలపైా స్పందించారు. ఎలాంటి చర్చలు జరగడం లేదని తేల్చేశారు. నవంబర్‌లో తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తానని .. ఇక పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తానని అంటున్నారు. కమల్ భావజాలంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
అయినా ఇటీవలి కాలంలో ఆయన బీజేపీతో కలుస్తారన్న ప్రచారం జరిగింది. తమిళనాడులో బీజేపీకి జవసత్వాలు కల్పించేందుకు ఓ ప్రముఖ నేత కోసం ఆ పార్టీ చూస్తోంది. దాంతో చాలామందిపై రూమర్స్ వస్తున్నాయి. కానీ ఎవరూ బీజేపీ వైపు చూడటం లేదు. అక్కడే సమస్య వస్తోంది. కమల్ మాత్రం.. బీజేపీతో పొత్తు కానీ.. ఇతర బంధం కానీ పెట్టుకునే అవకాశం లేదని చెబుతున్నారు. ఆయన చివరికి డీఎంకే కూటమిలో చేరే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది.